
టీడీపీ పార్టీ యువనేత నారా లోకేష్‌తో, నందమూరి తారకరత్న మర్యాద పూర్వకంగా కలిశారు. వీరిద్దరి మధ్య ఫ్యామిలీ విషయాలతో పాటు రాజకీయ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉందని ఇటీవల తారకరత్న వెల్లడించారు. ఈ క్రమంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే ఎన్నికల్లో తారక రత్న ఎమ్మెల్యే టికెట్ విషయమూ చర్చకు వచ్చినట్లు సమాచారం.
తారకరత్న ఏపీ నుండి పోటీకి సిద్దమైతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే తారకరత్న ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో నందమూరి కుటుంబం సంపూర్ణ మద్దతు తెలుగుదేశానికి ఉంటుందని తారకరత్న ఇప్పటికే వెల్లడించారు. నందమూరి, నారా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కొందరు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలోనూ తారకరత్న టీడీపీకి మద్దతుగా పలు జిల్లాల్లో పర్యటించారు.