హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోనూ టీడీపీని బలోపేతం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ అన్నారు. పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా గ్రామస్థాయి నుంచి కలిసి కట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. బుధవారం ఏపీలోని అమరావతిలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గర సీఎం చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి మహానాడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ..." నేను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకొని నెల దాటింది. తెలంగాణతోపాటు అండమాన్‌లో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అక్కడి నాయకులను, కార్యకర్తలను తప్పనిసరిగా కలుస్తా. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా మనం జయప్రదం చేద్దాం. కలిసికట్టుగా టీడీపీకి గ్రామస్థాయి నుంచి మళ్లీ పూర్యవైభం తీసుకొచ్చేలా పనిచేస్తానని హామీ ఇస్తున్నాను" అని పేర్కొన్నారు.
