- నేటి నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరణ
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట దేవస్థానంలో నిర్వహించిన నారసింహుడి జయంతి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 26న యాదగిరిగుట్టలో, 27న పాతగుట్టలో ప్రారంభమైన ఉత్సవాలకు మహాపూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకం, నృసింహ జయంతి, నారసింహ ఆవిర్భావ ఘట్టంతో అర్చకులు పరిసమాప్తి పలికారు. ఉదయం నిత్య పూజల అనంతరం మహాపూర్ణాహుతి నిర్వహించారు. తర్వాత ప్రధానాలయ ముఖ మంటపంలో సహస్ర కలశాభిషేకాన్ని జరిపారు. సాయంత్రం ఆలయంలో నృసింహ జయంతి, స్వామివారి ఆవిర్భావ కార్యక్రమాలు, నివేదన, తీర్థప్రసాద గోష్టి కార్యక్రమాలను నిర్వహించారు.
ఆయా కార్యక్రమాల్లో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణీ కుముదిని, ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు, ఈవో భవానీ శంకర్, డిప్యూటీ ఈవో నవీన్‌కుమార్, ఏఈవో శంకర్‌నాయక్, సూపరింటెండెంట్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. నారసింహుడి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 26 నుంచి నిలిపివేసిన నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవాలు, ఆర్జిత సేవలు శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.
