- నారాయణమూర్తి లాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో దొరకరు
- ఆయనకు కమర్షియాలిటీ లేదు..
- టెంపర్ సినిమా ఆఫర్ వదులుకోవడం గ్రేట్
- ఇప్పటికీ అవే చెప్పులు, సంచి, నడక
- “మార్కెట్లో ప్రజాస్వామ్యం” ఆడియో వేడుకలో చిరంజీవి
హైదరాబాద్ : తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఆర్.నారాయణమూర్తిది విలక్షణమైన వ్యక్తిత్వం అని అన్నారు అగ్ర హీరో చిరంజీవి. హైదరాబాద్ లో.. ‘మార్కెట్ లో ప్రజాస్వామ్యం’ సినిమా ఆడియో రిలీజ్, ప్రి-రిలీజ్ ఈవెంట్ కు ఆయన చీఫ్ గెస్ట్ గా అటెండయ్యారు. ఆర్.నారాయణమూర్తి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఆయనే హీరోగా నటించారు. కార్యక్రమానికి దర్శకుడు కొరటాల శివ, రచయితలు సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న, మ్యూజిక్ డైరెక్టర్ వందేమాతరం శ్రీనివాస్ హాజరయ్యారు.
తన ఆహ్వానాన్ని గౌరవించి కార్యక్రమానికి వచ్చినందుకు చిరంజీవికి నారాయణమూర్తి ధన్యవాదాలు తెలిపారు.
నారాయణమూర్తి తనను ఆహ్వానించినప్పుడు ఆశ్చర్యపోయానని చిరంజీవి చెప్పారు. “4 రోజులు కింద సైరా సెట్ కు నారాయణమూర్తి వచ్చి… తన సినిమా ఆడియో ఫంక్షన్ కు రావాలని కోరారు. నారాయణ మూర్తి ఫంక్షన్స్ కు నన్ను ఆహ్వానించడమే ఆఫ్ బీట్ గా అనిపించింది. సినిమాలు, సినిమా ఫంక్షన్లు నారాయణమూర్తి తనకు తోచిన విధంగా జరుపుకుంటుంటారు. అలాంటిది అభిమానంతో నన్ను పిలవడం సంతోషంగా ఉంది. నేను రావడం ఆయనకు సంతోషం కావచ్చు.. కానీ.. నా కుటుంబసభ్యుడిలాంటి నారాయణమూర్తి సినిమా ఆడియో వేడుకకు రావడం నాకు సంతోషం, సంతృప్తినిస్తోంది. పెద్ద ఫంక్షన్లకు వెళ్తే మనసుతో వెళ్లకపోవచ్చు. కానీ.. ఈ ఫంక్షన్ లో కుటుంబ సభ్యుడి ఫంక్షన్ కు వచ్చినట్టుగా ఉంది” అన్నారు చిరంజీవి.
టెంపర్ సినిమా ఆఫర్ వదులుకోవడం ఆయనేంటో చెబుతుంది- చిరంజీవి
నారాయణమూర్తితో తనది 4 దశాబ్దాల పరిచయం అన్నారు చిరంజీవి. “1978లో ప్రాణం ఖరీదు చేస్తున్నప్పుడు.. నూతన్ ప్రసాద్ కు అసిస్టెంట్ గా ఓ చిన్న పాత్రలో కుర్రాడిగా నారాయణమూర్తి నటించాడు. అప్పటినుంచి స్నేహం కొనసాగింది. ఇప్పటివరకు తాను నమ్మినబాటలోనే నడిచి డెడికేటెడ్ అంటే ఏంటో చూపించాడు నారాయణమూర్తి. ఆయనది నిఖార్సైన మనస్తత్వం. సినిమాపైన ఎంతో ప్యాషన్ చూపిస్తుంటారు. ఈ స్థాయికి రావడానికి కారణం ఆయన అంకితభావమే. కమ్యూనల్ భావజాలంతో ఆలోచింపచేసే సినిమాలు సుదీర్ఘంగా తీయడం.. అతన్ని అభ్యుదయవాదిగా.. కమిటెడ్ మనిషిగా చేశాయి. నటుడుగా, నిర్మాత, దర్శకుడిగా 30 సినిమాలు చేసి శెభాష్ అనిపించుకుంటున్నాడు” అన్నాడు చిరంజీవి.
