వెలుగు ఎఫెక్ట్: నారాయణపురం రైతుల గోసపై  సర్కారు స్పందన

వెలుగు ఎఫెక్ట్: నారాయణపురం రైతుల గోసపై  సర్కారు స్పందన

హైదరాబాద్, వెలుగు: ‘ఆ ఊర్లో ఒక్కరికీ రైతుబంధు వస్తలేదు’ అనే హెడ్డింగ్ తో మే 31న 'వెలుగు' పేపర్ లో వచ్చిన వార్తపై ప్రభుత్వం స్పందించింది. రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ కమిషనర్ శేషాద్రి ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించి సమస్య పరిష్కారం దిశగా సన్నాహాలు ప్రారంభించారు. కేసముద్రం మండలం నారాయణపురంలోని  43 సర్వే నంబర్లకు సంబంధించి 1,403.12 ఎకరాలతోపాటు మొత్తం 1,827 ఎకరాల పహాణీ పత్రాలను విడుదల చేశారు. తహసీల్దార్ సరితారాణి నారాయణపురం వెళ్లి రైతుల సమక్షంలో ఈ లిస్టును గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులో పెట్టారు. ఈ సర్వే నంబర్లలోని రైతుల భూములకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ పహాణీలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలున్నా.. ఈ నెల 10వ తేదీలోగా  ఆధారాలతో జాయింట్ తహసీల్దార్ కు అందించాలని సూచించారు. అయితే 2016=‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌17 భూప్రక్షాళన జాబితాలో ఈ భూముల్లో సర్వే నంబర్లు, కమతాలకు మధ్య భారీగా మిస్ మ్యాచింగ్ ఉందని, అసలు భూమి 1,827  ఎకరాలకు గాను 2,388 ఎకరాలు ఉన్నట్లు పహాణీలు ఉన్నాయి. 500 ఎకరాలకుపైగా భూముల వివరాల్లో  పొరపాట్లు దొర్లాయని ప్రత్యేక ఫార్మాట్ ద్వారా గుర్తిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు, ఉన్నతాధికారుల హామీ మేరకు సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ గౌతమ్ తెలిపారు.