కుటుంబ రాజకీయాలు, అధికారం కోసమే వాళ్లంతా ఒక్కటయ్యారు:మోడీ

కుటుంబ రాజకీయాలు, అధికారం కోసమే వాళ్లంతా ఒక్కటయ్యారు:మోడీ
  • ఏ స్వార్థం వాళ్లను కలుపుతున్నదో ప్రజలకు తెలుసు  
  • కాలపరీక్షకు నిలిచిన కూటమి మాది 
  • ఎన్డీఏ అంటే.. న్యూఇండియా, డెవలప్డ్ నేషన్, పీపుల్స్ అండ్ రీజియన్స్ యాస్పిరేషన్స్ అని ప్రకటన 
  • మీటింగ్​కు 38 పార్టీల నేతలు హాజరు 

న్యూఢిల్లీ:  దేశ రాజకీయాల్లో ఎన్నో అలయెన్స్​లు ఏర్పడ్డాయని, కానీ నెగెటివ్ ఆలోచనలతో ఏర్పడిన కూటమి మాత్రం ఎన్నడూ గెలవలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మనసులో కులతత్వం, ప్రాంతీయవాదాన్ని ఉంచుకుని, కుటుంబ రాజకీయాలు, అధికారం కోసం, అవినీతికి పాల్పడాలన్న ఉద్దేశంతో ఏర్పడే కూటమి దేశానికి చాలా ప్రమాదకరమన్నారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) పార్టీల సమావేశంలో మోదీ మాట్లాడారు. ప్రతిపక్షాల కొత్త కూటమిపై పరోక్షంగా ఆయన ఫైర్ అయ్యారు. ఎన్డీఏ దేశ ప్రజలను ఒక్కటిగా కలుపుతుందని, ప్రతిపక్ష కూటమి మాత్రం ప్రజలను విభజిస్తుందన్నారు. 

ఆ పార్టీల అలయెన్స్అవినీతి గ్యాంగ్​

ఎన్డీఏ కూటమి ఇటీవలే 25 ఏండ్లు పూర్తి చేసుకున్నదని, ఇది కాలపరీక్షకు నిలిచిన కూటమి అని అన్నారు. ఎన్డీఏ పాలనలో దేశ అభివృద్ధి పరుగులు పెట్టిందని, ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేరుతున్నాయని తెలిపారు. ‘‘ఎన్డీఏ ప్రాంతీయ ఆకాంక్షలతో కూడిన ఒక అందమైన ఇంద్ర ధనస్సు వంటిది. రాష్ట్రాల అభివృద్ధి ద్వారా దేశ అభివృద్ధి కోసం ఇది పని చేస్తున్నది” అని చెప్పారు. ఎన్డీఏలో ఎన్ అంటే న్యూ ఇండియా అని, డీ అంటే డెవలప్డ్ నేషన్ అని, ఏ అంటే యాస్పిరేషన్స్ (ప్రజల, ప్రాంతాల ఆకాంక్షలు).. అని మోదీ అభివర్ణించారు. ఎన్డీఏలో ఏ పార్టీ కూడా పెద్దది లేదా చిన్నది కాదని.. అన్ని పార్టీలూ సమానమేనన్నారు. దేశం, దాని ప్రగతి, భద్రత, ప్రజల సాధికారత అన్నవే ఎన్డీఏ సిద్ధాంతమని, వీటికే తమ కూటమి ప్రాధాన్యం ఇస్తుందన్నారు.  

కూటములతో ప్రభుత్వాలను కూల్చిన్రు 

కాంగ్రెస్ పార్టీ 1990లలో దేశంలో అస్థిరత్వాన్ని తెచ్చేందుకు అలయెన్స్ లను ఉపయోగించుకుందని మోదీ విమర్శించారు. ‘‘వాళ్లు ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. వాటిని మళ్లీ వాళ్లే కూల్చారు కూడా. అలాంటి పరిస్థితుల్లో 1998లో ఎన్డీఏ పుట్టింది. ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు. ఎవరినీ అధికారంలోంచి దింపేందుకు కాదు. ఇది దేశంలో స్థిరత్వం కోసం ఏర్పాటైంది” అని ఆయన చెప్పారు.  యూపీఏ హయాంలో నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఉండేదని, పాలసీ పారలైసిస్ కొనసాగిందన్నారు. స్థిరమైన ప్రభుత్వం ఉంటే, దేశం తీసుకునే నిర్ణయాల దిశ కూడా మారుతుందన్నారు. దీనిని అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో చూశామని, ఆ తర్వాత మళ్లీ గత 9 ఏండ్లుగా చూస్తున్నామన్నారు. స్థిరమైన ప్రభుత్వం వల్ల ఇండియా పట్ల ప్రపంచానికి నమ్మకం పెరిగిందన్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో కేంద్ర పథకాలను కూడా అమలు చేయడంలేదన్నారు. 

మేం విదేశీ సాయం కోరలే


ఎన్డీఏ కూటమి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నిర్మాణాత్మక రాజకీయాలు చేసిందని మోదీ అన్నారు. ‘‘మేం ఎన్నడూ నెగెటివ్ పాలిటిక్స్ చేయలేదు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించాం. స్కాంలను బయటపెట్టాం. కానీ ప్రజల తీర్పును అగౌరవపర్చలేదు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించేందుకు విదేశీ సాయాన్ని కోరలేదు. ఎన్డీఏ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దేశ అభివృద్ధికి అడ్డంకిగా నిలవలేదు” అని స్పష్టం చేశారు. సామాన్య ప్రజల తెలివితేటలను అపొజిషన్ తక్కువగా అంచనా వేస్తోందని, కానీ ఏ స్వార్థం వారిని కలుపుతోందో ప్రజలకు తెలుసన్నారు. ప్రతిపక్షాలకు చెందిన ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిని చేశామని, ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్ లను పద్మ అవార్డులతో గౌరవించామన్నారు. ‘‘నేను పొరపాట్లు చేయొచ్చు. కానీ చెడు ఉద్దేశంతో ఏ పనీ చేయలేదు” అని స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలనలో ఏ చిన్న ప్రయత్నాన్ని కూడా వదులుకోవడంలేదన్నారు. నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం 2015-16 తర్వాత 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. దేశంలో కొద్ది కాలంలోనే 40 కోట్ల మంది పేదరికాన్ని జయించారని ప్రపంచ బ్యాంకు సైతం చెప్పిందన్నారు. ఇండియాలో తీవ్రమైన పేదరికం తుడిచిపెట్టుకుపోయే దశలో ఉందని ఐఎంఎఫ్ కూడా ప్రశంసించిందన్నారు. 

ఎన్డీఏలోకి ఎల్జేపీ (రామ్ విలాస్)

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో అన్ని ఎంపీ సీట్లనూ ఎన్డీఏ కూటమే గెలుచుకుంటుందని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ప్రెసిడెంట్ చిరాగ్ పాశ్వాన్ అన్నారు. బీజేపీ హైకమాండ్ తో చర్చించిన తర్వాత తన పార్టీ కూడా ఎన్డీఏ కూటమిలో చేరిందని మంగళవారం ఢిల్లీలో ఆయన ప్రకటించారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యానని, వచ్చే లోక్ సభ ఎన్నికలు, బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ కు సంబంధించి తన అభిప్రాయాలను వారు పరిగణనలోకి తీసుకున్నారని వెల్లడించారు. హజీపూర్ లోక్ సభ స్థానం నుంచే తాను బరిలోకి దిగుతున్నానని తెలిపారు. కాగా, ఎన్డీఏలో చేరిక ప్రకటనకు ముందు తన చిన్నాన్న, కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్ కు పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకు న్నారు. అయితే రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఎల్జేపీ నాయకత్వం విషయంలో చిరాగ్, పశుపతి మధ్య వివాదం నెలకొంది. దీంతో పశుపతి రాష్ట్రీయ లోక్ జన శక్తి పార్టీ స్థాపించారు. 2019లో హజీపూర్ నుంచి ఎంపీగా గెలిచి ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అయ్యారు.

38 పార్టీల నేతలు హాజరు

ఎన్డీఏ మీటింగ్ కు కూటమిలోని 38 పార్టీల నేతలు హాజరయ్యారు. ప్రధాని మోదీకి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, శివసేన నేత, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, తమిళనాడు మాజీ సీఎం, అన్నా డీఎంకే నేత కె. పళనిస్వామి, నాగాలాండ్ సీఎం నిఫ్యూ రియో, హిందూస్థానీ ఆవామ్ మోర్చా నేత, బీహార్ మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝి స్వాగతం పలికారు. కాగా, మోదీ రెండో సారి ప్రధాని అయిన తర్వాత ఎన్డీఏ కూటమి పార్టీలు భేటీ కావడం ఇదే తొలిసారి. బెంగళూరులో 26 ప్రతిపక్ష పార్టీల మీటింగ్ జరుగుతున్న రోజునే అధికార ఎన్డీఏలోని 38 పార్టీలు ఢిల్లీలో భేటీ అయి బలం చాటుకున్నట్లు అయింది.