- కెనెషెట్లో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా రికార్డు
జెరూసలేం: ఇజ్రాయెల్ పార్లమెంటు ‘క్నెసెట్’ను ఉద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక, వ్యూహాత్మక బంధానికి అద్దం పట్టింది. ఈ పవిత్ర గడ్డతో భారత్‌కు ఉన్న అనుబంధం కేవలం దౌత్యపరమైనది మాత్రమే కాదని, అది రక్తం మరియు త్యాగాలతో ముడిపడి ఉందని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో హైఫా విముక్తి కోసం సుమారు 4 వేల మందికి పైగా భారత సైనికులు ఇక్కడ ప్రాణత్యాగం చేశారని, ఆ చరిత్రను భారత్ ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఇజ్రాయెల్‌కు భారత్ మద్దతును మోదీ ప్రకటించారు. 2023 అక్టోబర్‌లో హమాస్ జరిపిన దాడిని ముంబై 26/11 దాడులతో పోలుస్తూ, ఇజ్రాయెల్ పడుతున్న వేదనను భారత్ పంచుకుంటోందని చెప్పారు.
"మేము మీ బాధను అర్థం చేసుకోగలము, ఈ క్లిష్ట సమయంలో భారత్ మీకు అండగా నిలుస్తుంది" అని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు.
మోదీకి అత్యున్నత పురస్కారం..
ఇజ్రాయెల్ ప్రభుత్వం భారత ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం ‘స్పీకర్ ఆఫ్ ది సెనెట్ మెడల్’ ను ప్రకటించింది. భారత్ -ఇజ్రాయెల్ మైత్రిని సరికొత్త శిఖరాలకు చేర్చినందుకు మోదీకి ఈ పురస్కారం ప్రదానం చేశారు. కాగా, గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం రెట్టింపు అయ్యిందని, సహకారం మూడు రెట్లు పెరిగిందని మోదీ వెల్లడించారు. పలు రంగాల్లో ఇజ్రాయెల్ నైపుణ్యం, భారత్ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి కలిసి అద్భుతాలు సృష్టిస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
బెన్ గురియన్ విమానాశ్రయంలో దిగిన ప్రధాని నరేంద్ర మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఆయన భార్య సారా స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి వెల్‌కమ్ చెప్పారు. ప్రధాని మోదీని నెతన్యాహు ఆత్మీయ ఆలింగనంతో పలకరించారు. అనంతరం ఇరునేతలు గౌరవ వందనం స్వీకరించారు.
