విదేశీ వస్తువుల వాడకం తగ్గించుకోండి

విదేశీ వస్తువుల వాడకం తగ్గించుకోండి

‘జేఐటీవో కనెక్ట్ 2022’ బిజినెస్‌‌ మీట్‌‌లో ప్రధాని
ఓకల్ ఫర్ లోకల్‌‌పై ఫోకస్ చేయాలని సూచన

పుణె :   స్వాతంత్య్రం  వచ్చి 75 ఏండ్లు అవుతున్నదని, విదేశీ వస్తువుల వాడాకాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌‌ నిర్వహిస్తున్న ‘జేఐటీవో కనెక్ట్ 2022’ బిజినెస్‌‌ మీట్‌‌ను వీడియో లింక్ ద్వారా ప్రధాని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఓకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ఫాలో కావాలని, విదేశీ వస్తువుల ఉపయోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సంబురాల్లో ఓకల్ ఫర్ లోకల్ మంత్రంపై ఫోకస్ చేయాలని జేఐటీవోను కోరారు. ‘‘విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని మనం తగ్గించుకోవాలి. ఎగుమతులకు కొత్త గమ్యాలను వెతకాలి. ఇదే సమయంలో స్థానిక మార్కెట్లలో అవగాహన కల్పించాలి. స్థానిక ఉత్పత్తుల్లో ఎలాంటి లోపాల ఉండొద్దు” అని మోడీ అన్నారు. 

ప్రతిభను ప్రోత్సహిస్తున్నం.. 

రోజూ కొత్త స్టార్టప్స్

‘‘ప్రతిభ, వాణిజ్యం, సాంకేతికతను దేశంలో ప్రోత్సహిస్తున్నం. రోజూ డజన్ల కొద్దీ స్టార్టప్స్‌‌ రిజిస్టర్ అవుతున్నయి. ప్రతి వారం ఓ యూనికార్న్‌‌ తయారవుతున్నది. స్వాలంబన సాధించిన ఇండియానే మన మార్గం.. మన సంకల్పం” అని ప్రధాని మోడీ వివరించారు. ప్రయత్నించాలనే సంకల్పం, ప్రజల మద్దతు ఈ ప్రభుత్వానికి ఉందని, అలాంటప్పుడు మార్పు అనివార్యమని చెప్పారు. ‘‘జేఐటీవో యువ సభ్యులు ఇన్నొవేటర్లు, ఎంట్రప్రెన్యూవర్లు. జీరో బడ్జెట్‌‌తో కూడిన ప్రకృతి వ్యవసాయంపై, ఫుడ్ ప్రాసెసింగ్‌‌పై, వ్యవసాయ టెక్నాలజీపై, ఆరోగ్య రంగం, రీసైక్లింగ్– రీయూస్‌‌పై ఫోకస్ చేసే సర్క్యులర్ ఎకానమీపై పెట్టుబడి పెట్టాలని వారిని కోరుతున్నా” అని పిలుపునిచ్చారు.