Cricket World Cup 2023: కోహ్లీ, షమీపై ప్రధాని మోదీ ప్రశంసలు..

Cricket World Cup 2023: కోహ్లీ, షమీపై  ప్రధాని మోదీ ప్రశంసలు..

వరల్డ్ కప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతుంది. 2015, 2019 వన్డే వరల్డ్ కప్ లో సెమీ ఫైనలిస్ట్ గా నిలిచిన భారత క్రికెట్ జట్టు ఈ సారి మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తూ ఫైనల్లో అడుగుపెట్టింది. నిన్న(నవంబర్ 15) జరిగిన తొలి సెమీ ఫైనల్లో న్యూజీలాండ్ పై ఘన విజయం సాధించి 12 ఏళ్ళ తర్వాత వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 70 పరుగుల తేడాతో విజయం సాధించి 2019లో వరల్డ్ కప్ సెమీస్ లో కివీస్ పై ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ గెలుపుతో టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. తాజాగా భారత ప్రధాని మోదీ భారత విజయంపై స్పందించాడు. 

మొదటగా టీమిండియాను ప్రశంసించిన మోదీ ఆ తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీ, మహమ్మద్ షమీను అభినందించారు.‘టీమిండియా గెలిచినందుకు అభినందనలు. భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచి, ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ తో సమిష్టిగా పోరాడారు. ఫైనల్ మ్యాచ్‌కు నా శుభాకాంక్షలు’’ అని టీమిండియాను ప్రధాని మోదీ కొనియాడారు.

‘‘ఈ రోజు విరాట్ కోహ్లీ తన 50వ వన్డే సెంచరీని సాధించాడు. ఆటమీద అతనికి ఉన్న అంకిత భావం, ఎంత పట్టుదల ఉందో అర్ధం అవుతుంది. ఈ అద్భుతమైన మైలురాయి ఆయన నిరంతర అంకితభావానికి, అసాధారణమైన ప్రతిభకు నిదర్శనం. నేను ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భవిష్యత్ తరాలకు ఆయన మార్గదర్శకంగా ఉంటాడు. ’’ అని కింగ్ కోహ్లీపై ప్రధాని ప్రశంసలు కురిపించారు.

‘‘నేటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బౌలింగ్ తో అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శన చేసినందుకు మహమ్మద్ షమీకి నా ధన్యవాదాలు. ఈ మ్యాచ్‌లో ఎంతో గొప్పగా బౌలింగ్ చేసాడు. ఈ ప్రపంచకప్ ద్వారా షమీ క్రికెట్ ప్రేమికులు, భవిష్యత్ తరాలు ఎంతో ఆదరిస్తారు.’’ అని మోదీ ట్వీట్ చేశారు. మోదీతో పాటు ఎంతోమంది సినీ రాజకీయ, క్రీడా ప్రముఖులు టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేసారు.