అగ్రి చట్టాల్లో ఒక్క తప్పూ చూపలే

అగ్రి చట్టాల్లో ఒక్క తప్పూ చూపలే
  • నల్లచట్టాలు అంటున్నరు.. నలుపేందో చెప్పండి
  • రాజ్యసభలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్

న్యూఢిల్లీ: ‘‘కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో రైతుల సెంటిమెంట్లను గౌరవించి సవరణలకు ఒప్పుకున్నాం. అంతేకానీ చట్టాల్లో లోపాలు ఉన్నాయని కాదు. నిరసనలు తెలుపుతున్న రైతుల యూనియన్లు కానీ, వారి సింపతైజర్లు కానీ.. మూడు చట్టాల్లో ఒక్క తప్పును కూడా ఎత్తిచూపలేకపోయారు” అని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం రాజ్యసభలో ఆయన మాట్లాడారు. కేవలం ఒక్క రాష్ట్రంలోని రైతులను తప్పుడు సమాచారంతో రెచ్చగొట్టారని ఆరోపించారు. ఒక్క రాష్ట్రంలోని ప్రజలే తప్పుడు సమాచారానికి బాధితులయ్యారని చెప్పారు. ‘‘వ్యవసాయానికి నీళ్లు అవసరమని ప్రపంచానికి తెలుసు. కానీ కాంగ్రెస్ మాత్రమే రక్తంతో వ్యవసాయం చేయగలదు. బీజేపీ ఆ పని చేయలేదు’’ అని చెప్పారు.

నలుపు ఏంటో చెప్పండి?

‘‘మేం ప్రెస్టేజ్​కు పోవడంలేదు. ఆ మూడు చట్టాలు నల్ల చట్టాలని అంటున్నారు. ఆ చట్టాల్లో నలుపు ఏంటో చెప్పాలని, సరిదిద్దుకుంటానని గత రెండు నెలలుగా రైతు సంఘాలను అడుగుతున్నా. కానీ నాకు సమాధానం దొరకలేదు. (సభలో అపొజిషన్ బెంచీలను చూపిస్తూ..) ఇక్కడ కూడా ఎవరూ చట్టాల్లోని ప్రొవిజన్స్​ను ఎత్తిచూపడానికి ప్రయత్నించలేదు” అని తోమర్ చెప్పారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మండీ వ్యవస్థ కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేశారు. ‘‘నిజానికి ఆందోళనలు మండీల్లో జరిగిన అమ్మకాలపై (రాష్ట్ర ప్రభుత్వం) విధించే పన్నుకు వ్యతిరేకంగా ఉండాలి. కానీ విచిత్రంగా ఆ పన్నుల బాధ నుంచి కాపాడినందుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి” అని అన్నారు. కొత్త చట్టాలతో రైతులు ఎలాంటి పన్ను కట్టకుండా.. ఎక్కడైనా అమ్ముకోవచ్చన్నారు.

పంజాబ్ కాంట్రాక్ట్ చట్టం ఇదీ..

‘‘కేంద్ర చట్టం ప్రకారం.. కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తున్న రైతులు పంట అమ్మకానికి ఎలాంటి పన్ను కట్టే అవసరం లేదు. వారికి ఇష్టం లేకుంటే అగ్రిమెంట్ నుంచి కూడా బయటికి వచ్చేందుకు అవకాశం కల్పించాం. కానీ పంజాబ్ కాంట్రాక్ట్ చట్టంలోని ప్రొవిజన్ల ప్రకారం.. అగ్రిమెంట్​ను ఉల్లంఘిస్తే జైలు శిక్ష, లేదా రూ.5 లక్షల దాకా పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది” అని తోమర్ వివరించారు. పంజాబ్​లో రూల్స్ డిఫరెంట్​గా ఉన్నాయని, ట్యాక్స్​లు విధిస్తున్న వారికి వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేయాలని ఆయన కోరారు.

రైతుల సెంటిమెంట్లను గౌరవించి సవరణలకు ఒప్పుకున్నాం. అంతేకానీ చట్టాల్లో లోపాలు ఉన్నాయని కాదు. నిరసనలు తెలుపుతున్న రైతుల యూనియన్లు కానీ, వారి సింపతైజర్లు కానీ.. మూడు చట్టాల్లో ఒక్క తప్పును కూడా చూపలేకపోయారు. కేవలం ఒక్క రాష్ట్రంలోని రైతులను తప్పుడు సమాచారంతో రెచ్చగొట్టారు.

‑ కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్