సికింద్రాబాద్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. ఈ బీఆర్ఎస్ సీనియర్ నేత సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది.
పెద్ది సుదర్శన్ రెడ్డి 2018లో నర్సంపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నర్సంపేట నియోజకవర్గంలోని ఆయన స్వగ్రామం నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం..
* ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడిగా గుర్తింపు పొందారు.
* 2000 సంవత్సరంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరి పార్టీ బలోపేతానికి కృషి చేశారు.
* 2001లో నల్లబెల్లి మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై ప్రజాప్రతినిధిగా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.
* 2004లో ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ కన్వీనర్‌గా, అనంతరం జిల్లా అధ్యక్షుడిగా సుమారు ఎనిమిదేళ్లు బాధ్యతలు నిర్వహించారు.
* తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్‌కు సన్నిహితుడిగా పలు ఉద్యమాలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
* 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
* 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నుంచి విజయం సాధించి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
* అనంతరం తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.
* 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నర్సంపేట నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో ఓడిపోయారు.
