తెలంగాణ శబరిమల.. మన నర్సంపేట

తెలంగాణ శబరిమల.. మన నర్సంపేట

నర్సంపేటలోని శ్రీధర్మశాస్తా అయ్యప్ప గుడికి చాలా విశిష్టత ఉంది. ఇరవైయేండ్లుగా శబరిమల అయ్యప్పకి జరిగే పూజలన్నీ ఈ గుడిలోని అయ్యప్ప స్వామికి కూడా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం వేలమంది భక్తులు ఈ గుడిలో అయ్యప్ప మాల తీసుకుంటున్నారు. అందుకే ఈ గుడికి తెలంగాణ శబరిమలగా పేరొచ్చింది.  

నర్సంపేటలోని వరంగల్ రోడ్లో ఉంది ఈ అయ్యప్ప గుడి. ఇరవైయేండ్ల కిందట శింగిరికొండ రామాంజనేయులు అనే ఆయన దాతల సాయంతో ఈ గుడి కట్టించాడు. అప్పట్నించీ ప్రతి ఏటా ఈ అయ్యప్ప గుడిలో మాల తీసుకునే స్వాముల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దాంతో కార్తీక మాసంలో ఈ దేవాలయమంతా అయ్యప్ప నామ స్మరణతో మారుమోగుతోంది. ఈ గుడికి తెలంగాణ శబరిమలగా పేరొచ్చింది. 

శబరిమలై తరహాలోనే..

కేరళలోని శబరిమలైలో జరిగే ఉత్సవ బలి, క్షేత్ర బలి, పల్లిపేట, పంబా రట్టు, నాలుగు పడి పూజలన్నీ ఈ గుడిలో కొలువై ఉన్న అయ్యప్పకి జరుగుతాయి. పల్లివేట, పంబారట్టు ఉత్సవాలకు అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ఊరేగింపుగా పుంగావనం. జలక్రీడ కోసం మాదన్నపేట చెరువుకి తీసుకెళ్తారు. ఈ రెండు ఉత్సవాల్ని చూడ్డానికి తెలంగాణతో పాటు దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు.

కార్తీక మాసంలో 41 రోజుల పాటు అన్నదానం జరుగుతుంది. ఈ గుడిలో ఎనిమిదేళ్ల కిందట ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. దాంతో ఈ గుడిలో ప్రతి ఏటా వందల మంది హనుమాన్ మాలలు కూడా తీసుకుంటున్నారు.