డిసెంబర్ 4న చలో పార్లమెంట్

డిసెంబర్ 4న చలో పార్లమెంట్
  • జాతీయ దళిత్  సమ్మిట్  వెల్లడి

సికింద్రాబాద్, వెలుగు :  దేశంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ స్థాయిలో ఉద్యమం నిర్వహిస్తామని జాతీయ దళిత సమ్మిట్  ప్రకటించింది. అందులో భాగంగా డిసెంబర్  4న చలో పార్లమెంట్  కార్యక్రమం చేపడతామని తెలిపింది. సెంటర్  ఫర్  దళిత్  స్టడీస్  ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు హైదరాబాద్​లో నిర్వహించిన జాతీయ దళిత్  సమ్మిట్ ఆదివారం  ముగిసింది. 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 92 సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 322 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. పది మందితో జాతీయ స్థాయి సమన్వయ కమిటీని ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మల్లేపల్లి లక్ష్మయ్య, మాజీ ఎంపీ రామచంద్ర డోమ్, వీఎస్ నిర్మల్, ధీరేంద్ర ఝా, గుల్జారీ సింగ్  గోరియా, డాక్టర్ విక్రమ్ సింగ్, కర్నల్ సింగ్ ఎలాహ, బి వెంకట్, సాయిబాలాజీ, వీణా పల్లికల్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. 

అనంతరం అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలో పొందుపర్చిన సామాజిక అంశాలను ప్రభుత్వాలు అమలు చేయట్లేదన్నారు. కుల నిర్మూలన అమలుకు నోచుకోవడం లేదని,  స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లయినా కుల వివక్ష పోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ మద్దతుతోనే దళితులు, సామాజిక తరగతులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అంబానీ, అదానీల అభివృద్ధి కోసమే మోదీ సర్కారు పనిచేస్తున్నదని విమర్శించారు. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో దళితుల సమస్యలే రాజకీయ ఎజెండా కావాలని ఆయన స్పష్టం చేశారు. ఈ అజెండాపై కోటి సంతకాలు సేకరించి రాష్ట్రపతికి అందజేస్తామని తెలిపారు.