ప్రచారానికి సీపీఎం అగ్రనేతలు.. నవంబర్ చివర్లో రాష్ట్రానికి నాయకులు

ప్రచారానికి సీపీఎం అగ్రనేతలు.. నవంబర్ చివర్లో రాష్ట్రానికి నాయకులు

ఈ నెలాఖరులో రాష్ట్రంలో పర్యటించనున్న నాయకులు 

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో  సీపీఎం అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు ఆ పార్టీ జాతీయ నేతలు రానున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకారత్, సుభాషిణీ అలీ, విజయరాఘవన్, బీవీ రాఘవులు తదితరులు తెలంగాణలో పర్యటించనున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.

మాణిక్‌‌ సర్కార్‌‌ ఈ నెల 24న ఖమ్మం, ముదిగొండ, 25న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాజేడు, భద్రాచలం, 26న పాలేరు సెగ్మెంట్ లోని కూసుమంచిలో ప్రచారం చేస్తారు. సభలు, రోడ్‌‌షోల్లో పాల్గొంటారు. సీతారాం ఏచూరి ఈ నెల 25వ తేదీన పాలేరు, 26న మిర్యాలగూడ, 27న భువనగిరి సెగ్మెంట్లలో పర్యటిస్తారు. బహిరంగసభలు, రోడ్‌‌షోలకు హాజరవుతారు.

బృందాకారత్‌‌ ఈనెల 25న వైరా, మధిర సెగ్మెంట్ లోని బోనకల్‌‌, 26న ఇబ్రహీంపట్నం, 27న భద్రాచలం సెగ్మెంట్​లోని దుమ్ముగూడెం, చర్ల, 28న కోదాడ, హుజూర్‌‌నగర్ లో ప్రచారంలో  పాల్గొంటారు.  సుభాషిణి అలీ ఈనెల 24న జనగాం, హైదరాబాదులోని ముషీరాబాద్​లో, విజయరాఘవన్‌‌ ఈనెల 20న భద్రాచలం వెంకటాపురంలో ప్రచారం చేస్తారు. బీవీ రాఘవులు ఈనెల 19న పటాన్‌‌చెరు నియోజకవర్గంలో నిర్వహించే సభకు హాజరు అవుతారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం 19 స్థానాల్లో  పోటీ చేస్తుంది.