
ఢిల్లీ : తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు.. చిత్ర విన్యాసాలు చేసే ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షులు స్వామి చక్రపాణి మహారాజ్ మరోసారి వార్తల్లోకెక్కారు. మరోసారి తన నోటి దురుసుతో విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని కోరారు. ఇతర మతాలు, ఇతర దేశాలు ప్రకటన చేయకముందే భారత పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఆయన మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లోనూ షేర్ చేశారు.
చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుడిని తాకిన చోటును శివ శక్తిగా పేరు పెట్టడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చక్రపాణి మహారాజ్ ధన్యవాదాలు తెలిపారు. చంద్రునిపై హిందూ దేశం స్థాపించిన తర్వాత శివ శక్తి పాయింట్‌ను రాజధానిగా మార్చాలని కోరారు.
చక్రపాణి మహారాజ్.. గతంలోనూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు గోమాంసం తినేవారికి ఎలాంటి సహాయం చేయకూడదని చెప్పి.. విమర్శల పాలయ్యారు.
2020లో దేశంలో కరోనా వైరస్ విజృంభించినప్పుడు కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. ఢిల్లీలో అఖిల భారత హిందూ మహాసభ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి, ఆవు మూత్రం తాగారు. గో మూత్రం తాగితే కరోనా వైరస్ నివారించబడుతుందని చెప్పారు. అంతేకాదు.. జంతువులను చంపి తినే వ్యక్తుల కారణంగానే కరోనా వైరస్ వచ్చిందంటూ మాట్లాడారు.
संसद से चांद को हिंदू सनातन राष्ट्र के रूप में घोषित किया जाए,चंद्रयान 3 के उतरने के स्थान "शिव शक्ति पॉइंट" को उसकी राजधानी के रूप में विकसित हो ,ताकि कोई आतंकी जिहादी मानसिकता का वहा न पहुंच पाए ???स्वामी चक्रपाणि महाराज, राष्ट्रीय अध्यक्ष, अखिल भारत हिंदू महासभा/ संत महासभा pic.twitter.com/HPbifYFZzX
— Swami Chakrapani Maharaj (@SwamyChakrapani) August 27, 2023
ఇక.. హిందూ మతాన్ని అవమానించే బాలీవుడ్ సినిమాలు, వెబ్‌సిరీస్ మ్యూజిక్ వీడియోలు మొదలైనవాటిలో కంటెంట్‌ను పర్యవేక్షించడానికి ధర్మ సెన్సార్ బోర్డును 2023లో ఏర్పాటు చేశాడు.