చాలీచాలని జీతాలతో ఉపాధి హామీ పథకం ఉద్యోగుల అవస్థలు

చాలీచాలని జీతాలతో ఉపాధి హామీ పథకం ఉద్యోగుల అవస్థలు
  • ఏండ్లు దాటినా రెగ్యులరైజ్ చేయని సర్కారు
  • రాష్ట్ర వ్యాప్తంగా 3,874 మంది నిరీక్షణ

నల్గొండ, వెలుగు: రాష్ట్రంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగులు సర్కారు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత 14 ఏండ్ల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నా.. సర్కారు రెగ్యులరైజ్ చేయడం లేదు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం.. తమ డిమాండ్లను కూడా పరిష్కరించాలని గతంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావును కోరారు. డీఆర్డీఏ, డ్వామా డిపార్ట్ మెంట్లను విలీనం చేసిన ప్రభుత్వం.. ఉద్యోగుల విషయంలో మాత్రం వేరువేరుగా పరిగణిస్తోంది. సెర్ప్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని, ఏప్రిల్ నుంచి పేస్కేల్ వర్తింపచేస్తామని ఇటీవల మంత్రి హరీశ్​రావు అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో తమను కూడా రెగ్యులరైజ్ చేయాలని డ్వామాలో పనిచేస్తున్న ఉపాధి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

కీలక ప్రోగ్రాలన్నీ ఉపాధి పథకం కిందకే..

రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఫ్లాగ్​షిప్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉపాధి పథకం నిధులతోనే అమలవుతున్నాయి. విలేజ్, టౌన్ పార్కులు, శ్మశానవాటికలు, హరితహారం, సీసీ రోడ్లు, ప్లే గ్రౌండ్స్, రైతు వేదికలు తదితర పథకాలన్నీ ఈ నిధులతోనే చేపడుతున్నారు. ఈ స్కీం కింద రాష్ట్ర వ్యాప్తంగా 3,874 మంది ఉద్యోగులు.. గత 14 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. నాలుగైదు వేలతో మొదలైన ఉద్యోగుల జీతాలు, ఇప్పటికీ ముప్పై వేలకు మించలేదు. సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. కానీ కొన్ని డిపార్ట్ మెంట్లకు మాత్రమే సర్వీసు క్రమబద్ధీకరణ కల్పించారు. ఉపాధి ఉద్యోగులను ఇప్పటికీ కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాలోనే ఉంచారు. అయితే సెర్ప్ ఉద్యోగులకు, ఉపాధి ఉద్యోగులకు సెంట్రల్ ఫండ్స్ నుంచే వేతనాలు అందుతున్నాయి. ఈ క్రమంలో కేవలం సెర్ప్ ఉద్యోగులకు మాత్రం పేస్కేల్ ప్రకటించి, ఉపాధి ఉద్యోగుల గురించి ఏ మాత్రం ప్రస్తావించకపోవడం పట్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


పేస్కేల్ వర్తింపజేయాలి

సెర్ప్ ఉద్యోగుల తరహాలోనే ఉపాధి ఉద్యోగులకు కూడా పేస్కేల్ వర్తింపజేయాలి. ఉపాధి స్కీం కింద 26 కేటగిరీల్లో మూడు వేల మందికి పైగా పనిచేస్తున్నాం. గతేడాది అసెంబ్లీ సమావేశాల్లో మా సర్వీసులు రెగ్యులరైజ్ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. సెర్ప్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం సంతోషమే. మమల్ని కూడా రెగ్యులరైజ్ చేసి, పే స్కేల్ అమలు చేయాలి.
– ఆర్ నర్సింహాచారి, స్టేట్ ఈజీఎస్ కోకన్వీనర్, నల్గొండ