క్రీడల్లో దేశం సత్తా చాటాలె : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

క్రీడల్లో దేశం సత్తా చాటాలె : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సికింద్రాబాద్, వెలుగు: క్రీడాకారులు సత్తా చాటి దేశానికి, రాష్ట్రానికి పేరు తేవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం జింఖానా గ్రౌండ్​లో నిర్వహించిన ‘ఖేలో తెలంగాణ.. జీతో తెలంగాణ’ పోటీల ముగింపు సభలో ఆయన మాట్లాడారు. పోటీల్లో అమ్మాయిలు ‘కిసీ సే కమ్ నహీ’ అన్నట్లుగా అద్భుతంగా ఆడారని ఆయన అభినందించారు. ప్రధాని మోడీ స్పోర్ట్స్ కు సంబంధించి ఒక విజన్​తో దేశంలోని అన్ని ప్రాంతాల్లో  పోటీలు నిర్వహించాలని చెప్పారని పేర్కొన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒలింపిక్స్ సహా పలు అంతర్జాతీయ పోటీల్లో మన క్రీడాకారులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు వ్యక్తులు, సంస్థలు క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.‘‘7 రోజులుగా దాదాపు 7 వేల మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నరు. ఒలింపిక్స్​ను మరిపించేలా ప్రదర్శన చూపారు. ఇదే స్ఫూర్తి భవిష్యత్ లో ​కొనసాగించి సత్తా చాటాలి. క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది” అని ఆయన అన్నారు. అంతకు ముందు లోక్​సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ.. ‘‘యువతలో ఆరోగ్యకర పోటీ పెంచి క్రీడాస్ఫూర్తిని నింపేందుకు అద్భుతమైన క్రీడాపోటీలు నిర్వహించారు. ఖోఖో, కబడ్డీ లాంటి టీమ్ స్పిరిట్ ఆటలు పెట్టినందుకు కిషన్ రెడ్డికి అభినందనలు” అని అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌‌‌‌చార్జి మురళీధర్ రావు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్​పేయ్​ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించడం సంతోషకరమన్నారు.  

బహుమతులు అందజేసిన కిషన్​రెడ్డి

సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో పదిరోజులుగా జరుగుతున్న పోటీల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 40 డివిజన్ల నుంచి యువత పోటీ పడ్డారు. పది వేల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకోగా 7,279 మంది పోటీల్లో పాల్గొన్నారు. విజయం సాధించిన జట్లు, క్రీడాకారులకు కిషన్​రెడ్డి బహుమతులు అందజేశారు.