ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

స్వాతంత్య్ర  సమరయోధులు సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ ఐక్యతా దినోత్సవం నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి, విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. పలు చోట్ల ఐక్యతా ర్యాలీలు చేపట్టారు. సంస్థానాలను దేశంలో విలీనం చేయడంలో సర్దార్ కృషి ఎనలేనిదన్నారు. నేటి యువత ఆ మహనీయుడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్లు, అధికారులు, ప్రొఫెసర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
- వెలుగు నెట్ వర్క్

ఇందిరా గాంధీకి నివాళి
వెలుగు నెట్ వర్క్: దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ లీడర్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ఇందిరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కొన్నిచోట్ల రోగులకు పండ్లు పంపిణీ చేశారు. గరాబీ హఠావో నినాదంతో ఇందిరా గాంధీ పేదలకు అండగా నిలిచారని కొనియాడారు. విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.

యునెస్కో ఆధ్వర్యంలో గ్లోబల్ నెట్ వర్కింగ్ లెర్నింగ్ సిటీస్ సభ్యులతో నిర్వహించిన వర్చువల్ వర్క్ షాప్​లో వరంగల్ మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. ఆయా సిటీల పాత మేయర్లు వారి అనుభవాలను పంచుకున్నారు. కొత్త మేయర్లు వారు చేపట్టబోయే కార్యక్రమాలు వివరించారు. 

చింతనెక్కొండకు మిలటరీ:ఇంజనీరింగ్ ఆఫీసర్లు
పర్వతగిరి, వెలుగు: విలేజ్ స్టడీ ప్రోగ్రాంలో భాగంగా మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ ఆఫీసర్లు సోమవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండకు వచ్చారు. వారం రోజుల పాటు ఇక్కడే ఉండి, గ్రామాభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారు. ఈ సందర్భంగా వారికి సర్పంచ్ గటిక సుష్మ, ఆఫీసర్లు స్వాగతం పలికారు.

వర్ధన్నపేటలో పెట్రోల్ తిప్పలు
వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో పెట్రోల్ కొరత ఏర్పడింది. మండలకేంద్రంలోని రెండు బంకుల్లో పెట్రోల్ అయిపోవడంతో ప్రజలు వరంగల్, రాయపర్తిలకు పరుగులు పెడుతున్నారు. కొందరు తమ వాహనాలను ఇండ్ల వద్దే ఉంచుతున్నారు. నాలుగు రోజులుగా ఇదే  పరిస్థితి ఉంది. అయితే స్టాక్ రాకపోవడం వల్లే పెట్రోల్ కొరత ఏర్పడిందని నిర్వాహకులు చెబుతున్నారు.