న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు తల పెట్టిన మూడు రోజుల సమ్మె వాయిదా పడింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తో ఆదివారం రాత్రి జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. వారానికి ఐదు రోజుల పనిదినాల డిమాండ్ తో బ్యాంకు యూనియన్లు ఈ నెల 28 నుంచి 30 వరకు.. మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి.
సమ్మె కారణంగా కస్టమర్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆదివారం (27వ తేదీ) ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఐబీఏతో యూనియన్ నేతలు, ప్రతినిధుల సమావేశం జరిగింది. వారానికి ఐదు రోజుల పని దినాలకు సంబంధించి ఐబీఏ, యూఎఫ్ బీయూ సభ్యులతో ఓ కమిటీని వెంటనే ఏర్పాటు చేసేందుకు ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.
ఆదివారంతో పాటు ప్రతీ శనివారం సెలవు ఇవ్వడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులపై ఈ కమిటీ క్షేత్రస్థాయిలో విచారించనుంది. అనంతరం ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించడం ఈ కమిటీ బాధ్యత, ఇతరత్రా డిమాండ్లనూ కమిటీ పరిశీలిస్తుందని యూనియన్ నేతలు తెలిపారు.
