జూబ్లీహిల్స్ ప్రజలకు పాదాభివందనం : నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్ ప్రజలకు పాదాభివందనం : నవీన్ యాదవ్
  • ప్రజలు, కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయను: నవీన్​ యాదవ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: భారీ మెజారిటీతో గెలి పించిన జూబ్లీహిల్స్ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని  నవీన్ యాదవ్ అన్నారు. కౌంటింగ్ అనంతరం నవీన్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ కార్యకర్తలు ఎంతో కష్టపడి తనను గెలిపించుకున్నారని, ప్రజలు, కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు. ఎన్నికలు అయిపోయాయని, ఇక అందరం కలిసి జూబ్లీహిల్స్​ను అభివృద్ధి చేసుకోవాలన్నారు. బీఆర్ఎస్ గెలిచిన సమయంలో కక్షపూరిత రాజకీయాలు చేశారని, తాను అలాంటివి చేయనన్నారు. 

అందరినీ కలుపుకొని పోతానన్నారు. స్థానిక సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని, అభివృద్ధే ఎజెండాగా పనిచేస్తానని చెప్పారు. తనపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. మంత్రులంతా తన గెలుపుకోసం పనిచేశారని, అందరి సహకారం వల్లే ఈ గెలుపు సాధ్యమైందన్నారు. 

రౌడీయిజం నా ఒంట్లోనే లేదు

బీఆర్ఎస్ అధికారంలోఉన్న సమయంలో కేటీఆర్ తనను వ్యక్తిగతంగా ఇబ్బందులు పెట్టారని, కేసు లు పెట్టి వేధించారని నవీన్ యాదవ్ అన్నారు.  రౌడీయి జం తన ఒంట్లోనే లేదని, బీఆర్ఎస్ ​హయాంలో తప్పు డు కేసులు పెట్టి రౌడీగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారు. దాన్ని తిప్పికొట్టి నిలబడ్డానని నవీన్​ యాదవ్​ పేర్కొన్నారు.