దేశవ్యాప్తంగా నేవీ డే సంబురాలు

దేశవ్యాప్తంగా నేవీ డే సంబురాలు

ఢిల్లీ : దేశవ్యాప్తంగా నేవీ డే సంబురాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమొరియల్ దగ్గర అమరవీరులకు నేవీ సిబ్బంది నివాళులర్పించారు. నేవీ చీఫ్ అడ్మిరల్  హరి కుమార్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఐఏఎఫ్  చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్  వీఆర్  చౌదరితో పాటు ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. విధి నిర్వహణలో అమరులైన వారికి నివాళులర్పించారు. అలాగే విశాఖపట్నంలోని సాగర తీరంలోనూ నేవీ డే వేడుకలు నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమానికి చీఫ్​ గెస్టుగా హాజరయ్యారు. రాష్ట్రపతితో పాటు ఏపీ సీఎం జగన్, గవర్నర్  విశ్వభూషణ్​ హరిచందన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేవీ సిబ్బంది రిహార్సల్స్ చూసేందుకు స్థానికులు భారీగా తరలివెళ్లారు. యుద్ధ నౌకలు, నేవీకి సంబంధించిన హెలికాప్టర్లతో సోల్జర్లు విన్యాసాలు చేశారు. ఇక సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లోనూ నేవీ డే వేడుకలు నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి పరేడ్  గ్రౌండ్ లో స్తూపం వద్ద అధికారులు నివాళులర్పించారు.

నేవీ చరిత్ర చూసి గర్వపడుతున్నం: మోడీ

దేశానికి కష్టం వచ్చిన ప్రతీసారి మన నేవీ ముందుండి పోరాడిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నేవీ డే సందర్భంగా సిబ్బంది త్యాగాలు, పోరాట పటిమను ఆయన కొనియాడారు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న నేవీని చూసి దేశం గర్విస్తున్నదని అన్నారు. ఈ సందర్భంగా నేవీ సిబ్బందికి, వారి కుటుంబాలకు ఆయన నేవీ డే శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్  చేశారు.