మిస్సైల్ డిస్ట్రాయర్‌‌: నేవీ అమ్ములపొదిలోకి ఐఎన్ఎస్ విశాఖపట్నం

మిస్సైల్ డిస్ట్రాయర్‌‌: నేవీ అమ్ములపొదిలోకి ఐఎన్ఎస్ విశాఖపట్నం

శత్రు దేశాల క్షిపణులకు దొరక్కుండా, వాటిని విధ్వంసం చేసే శక్తితో తయారైన ‘ఐఎన్‌‌ఎస్‌‌ విశాఖపట్నం’ నౌక ఆదివారం ఇండియన్ నేవీ అమ్ములపొదిలోకి చేరింది. ప్రాజెక్ట్‌‌-15బీలో భాగంగా నిర్మించిన ఈ నౌక స్టెల్త్ టెక్నాలజీతో శత్రువు కన్నుగప్పి ముందుకెళ్తుంది. ముంబైలోని నేవల్‌‌ డాక్‌‌యార్డ్‌‌లో జరిగిన కమిషనింగ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌‌నాథ్‌‌ సింగ్‌‌.. దీనిని జాతికి అంకితం చేశారు. విశాఖపట్నం క్లాస్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లకు ఇది ప్రధాన నౌక.  

ప్రాజెక్టు-15బీలో భాగంగా నాలుగు నౌకలను నిర్మించారు. వాటికి విశాఖపట్నం, మోర్ముగావ్‌‌, ఇంఫాల్‌‌, సూరత్‌‌ నగరాల పేర్లు పెట్టారు. అలాగే కల్వరి క్లాస్‌‌ సబ్‌‌ మెరైన్‌‌ ‘వేలా’ కమిషన్ సెరిమొనీ 28న జరగనుంది. ఈ కార్యక్రమానికి చీఫ్‌‌ ఆఫ్‌‌ నేవల్‌‌ స్టాఫ్‌‌ అడ్మిరల్‌‌ కరంబీర్‌‌ సింగ్‌‌ హాజరుకానున్నారు.

పాక్, చైనాలను తప్పుబట్టిన రాజ్‌నాథ్ సింగ్

ఐఎన్‌ఎస్ విశాఖపట్నం నౌకను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాకిస్థాన్‌, ఆ దేశాన్ని గుడ్డిగా సమర్థిస్తున్న దేశాలను తప్పుబట్టారు. పాకిస్థాన్‌ కుయుక్తులకు కొన్ని బాధ్యతారహితమైన దేశాలు సహకరిస్తున్నాయంటూ చైనాపై పరోక్షంగా మండిపడ్డారు. యూఎన్‌క్లోస్‌–1982  నిబంధనలు, విలువలను ఈ దేశాలు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తూ పాక్ స్వార్థ ప్రయోజనాలకు అండగా ఉంటున్నాయన్నారు. ఇండో పసిఫిక్‌ సముద్ర మార్గంలో భారత నేవీ పాత్ర చాలా కీలకమని చెప్పారు.  ఇండో పసిఫిక్ రీజియన్‌లో నేవిగేషన్ ఫ్రీడం, స్వేచ్ఛయుతమైన వాణిజ్యానికి భారత్ బాధ్యతాయుతంగా సహకరిస్తోందని రాజ్‌నాథ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ‘సాగర్’ పాలసీ కూడా ఆ విలువలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. మరోవైపు ఇండియా స్వదేశీ నౌకల తయారీకి హబ్‌గా మారుతోందని, మేకిన్ ఇండియా ద్వారా నౌకలు, సబ్‌మెరైన్‌ల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు.

ఐఎన్ఎస్ విశాఖ స్పెషాలిటీస్ ఇవీ..

  • షిప్‌‌ను డైరెక్టరేట్‌‌ ఆఫ్‌‌ నేవల్‌‌ డిజైన్‌‌ చేసింది. ముంబైలోని మజ్​గావ్ డాక్‌‌ లిమిటెడ్‌‌ నిర్మించింది. ఇందుకోసం స్వదేశీ ఉక్కును ఉపయోగించారు.
  • భారతదేశంలో తయారు చేసిన అతిపెద్ద డెస్ట్రాయర్లలో ఇది ఒకటి.
  • 164 -మీటర్ల పొడవు ఉంటుంది. 7,500 టన్నుల పూర్తి -లోడ్ సామర్థ్యం ఉంది.
  • గరిష్ట వేగం 30 నాట్లు. సుమారుగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. 
  • సెన్సర్లు, బ్రహ్మోస్ మిస్సైళ్లు, బరాక్ 8 మిస్సైళ్లు, మీడియం, షార్ట్ రేంజ్ గన్నులు, యాంటీ సబ్‌‌మెరైన్ రాకెట్లు, అడ్వాన్స్‌‌డ్‌‌ ఎలక్ట్రానిక్ వార్‌‌‌‌ఫేర్.. కమ్యూనికేషన్ సూట్లు, యాంటీ సబ్‌‌మెరైన్ వెపన్లు, హెవీ వెయిట్ 
  • టార్పెడో ట్యూబ్ లాంచర్లు, రాకెట్ లాంచర్లు ఏర్పాటు చేశారు. 
  • ఐఎన్‌‌ఎస్‌‌ విశాఖపట్నం కమాండింగ్‌‌ ఆఫీసర్‌‌గా‌ కెప్టెన్‌‌ బీరేంద్ర సింగ్‌‌ బైన్స్‌‌ వ్యవహరిస్తారు. ఈ నౌకలో 312 మంది సిబ్బంది ఉంటారు.