శివ కందుకూరి, తేజు అశ్విని జంటగా ప్రమోద్ హర్ష దర్శకత్వంలో రాధా వి పపుడిప్పు నిర్మించిన చిత్రం ‘నవాబ్ కేఫ్’. ఫిబ్రవరి 20న సినిమా విడుదల కానుంది. వాస్తవానికి ఈ సినిమాకు ‘చాయ్ వాలా’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా, సెన్సార్ రూల్స్, గైడ్‌లైన్స్ కారణంగా ‘నవాబ్ కేఫ్’గా మార్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో శివ కందుకూరి మాట్లాడుతూ ‘‘చాయ్ వాలా’ అంటూ మా జర్నీని ప్రారంభించాం.
అయితే సెన్సార్ రూల్స్, గైడ్ లైన్స్‌ని గౌరవిస్తూ ‘నవాబ్ కేఫ్’గా టైటిల్ మార్చాం. ఈ టైటిల్ సినిమాలోని స్టోరీని, ఆత్మని తెలియజేస్తుంది. టైటిల్ చేంజ్ అయినా, సెన్సార్ సమస్యలు వచ్చినా మా నిర్మాత వెంకట్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా, కాంప్రమైజ్ కాకుండా నిలబడ్డారు. ఎంతో నిజాయితీతో, జెన్యూన్‌గా ఈ మూవీని చేశాం. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.
సినిమా చూసి బయటకు వచ్చిన తరువాత కచ్చితంగా నాన్నకి ఫోన్ చేసి మాట్లాడతారు’ అని చెప్పాడు. ఇది తన మొదటి చిత్రమని, ఏ టైటిల్ పెట్టినా కంటెంట్ బాగుంటే, సినిమా నచ్చితే ఆడియెన్స్ ఆదరిస్తారని హీరోయిన్ తేజు అశ్విని చెప్పింది. తాను చూసిన, అనుభవించిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు దర్శకుడు ప్రమోద్ హర్ష చెప్పాడు. ‘నవాబ్ కేఫ్’ను ప్రేక్షకులు ఆదరించాలని నిర్మాత వెంకట్ కోరారు.
