పాకిస్తాన్​​లో సంకీర్ణ ప్రభుత్వమే పీఎంఎల్ఎన్, పీపీపీ అంగీకారం

పాకిస్తాన్​​లో సంకీర్ణ ప్రభుత్వమే  పీఎంఎల్ఎన్, పీపీపీ అంగీకారం

ఇస్లామాబాద్ :  పాకిస్తాన్​లో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు నవాజ్ షరీఫ్ ​పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్(పీఎంఎల్ఎన్), బిలావల్ భుట్టో జర్దారీ ఆధ్వర్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చాయి. ఇతర చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. అయితే, ప్రధాని పదవి ఎవరు చేపట్టాలి? రెండు పార్టీలు ఎన్నేండ్లు అధికారాన్ని షేర్ చేసుకోవాలనే దానిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. 

ఇప్పటికే మూడుసార్లు ప్రధానిగా పని చేసిన నవాజ్ షరీఫ్ నాలుగో సారి ప్రధాని కావాలని భావించినా.. ఆయన సంకీర్ణ సర్కారును నడిపేందుకు ఇష్టపడటంలేదని, అందుకే ఆయన తమ్ముడు షెహబాజ్ షరీఫ్​ను పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించినట్లు పాక్ మీడియా సోమవారం వెల్లడించింది. ఇక, పీపీపీ తరఫున ఆ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో ప్రధాని కావాలని ప్రతిపాదించినట్లు తెలిపింది. తొలి మూడేండ్లు పీఎంఎల్ఎన్​కు చాన్స్ ఇవ్వాలని, ఆ తర్వాత రెండేండ్లు పీపీపీకి ప్రధాని పదవి ఇవ్వాలన్న ప్రతిపాదనలకు పీపీపీ అంగీకరించలేదని వెల్లడించింది. మొత్తంగా ప్రభుత్వ ఏర్పాటుపై మరో రెండు రోజుల్లో స్పష్టత రావచ్చని పేర్కొంది.  

మేం ప్రతిపక్షంలోనే ఉంటాం: పీటీఐ 

పీఎంఎల్ఎన్ లేదా పీపీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రసక్తేలేదని సోమవారం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) ప్రకటించింది. తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని స్పష్టం చేసింది. కాగా, పాక్ నేషనల్ అసెంబ్లీలోని 265 అన్ రిజర్వ్​డ్ సీట్లకు జరిగిన ఎన్నికల్లో పీటీఐ పార్టీ మద్దతు ఇచ్చిన 
ఇండిపెండెంట్లు 101 సీట్లు గెలుచుకున్నారు.