నోయిడా: ఢిల్లీలో నేషనల్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ (NBF) వార్షిక సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా.. బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్పై (BARC) ఇటీవల వచ్చిన అవినీతి ఆరోపణలపై, లంచాల వ్యవహారంపై చర్చ జరిగింది. కేరళలో ఒక టీవీ ఛానల్ యాజమాన్యం రేటింగ్స్ పెంచుకునేందుకు BARCకు 1--0-0 కోట్ల లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ లంచం మొత్తాన్ని బార్క్ ఉద్యోగికి క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించినట్లు 24 న్యూస్ అనే ఛానల్ ప్రసారం చేసిన కథనం BARC విశ్వసనీయతనే ప్రశ్నార్థకంగా మార్చింది. NBF సమావేశంలో ప్రధానంగా ఈ ఆరోపణలపై తీవ్రంగా చర్చ జరిగింది.
ఇలాంటి ఆరోపణలు BARCపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తాయని.. టెలివిజన్ రేటింగ్స్ పారదర్శకతపై ప్రేక్షకుల్లో అప నమ్మకం ఏర్పడుతుందని NBF సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. BARC రేటింగ్స్పై వరుసగా ఆరోపణలు వస్తుండటంతో.. వీటికి చెక్ పెట్టేలా BARCలో మార్పులు జరగాలని NBF సభ్యులు అభిప్రాయపడ్డారు. రేటింగ్ మీటర్ల నిర్వహణలో టెక్నాలజీని వాడుకోవాలని, మీటర్ల సంఖ్యను మేనేజ్ చేయలేని స్థాయిలో పెంచాలని చర్చించారు.
ప్రత్యేకంగా.. న్యూస్ చానెళ్ల రేటింగ్‌పై అనుమానాలున్నాయని, న్యూస్ రేటింగ్ విశ్లేషణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఈ సమావేశంలో NBFను న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ & డిజిటల్ మీడియా ఫెడరేషన్ (NBDF)లోకి విస్తరిస్తున్నట్లు ప్రకటించారు.
టెలివిజన్ బ్రాడ్ కాస్టర్స్, డిజిటల్ పబ్లిషర్స్, టెక్నాలజీ ఆధారిత న్యూస్ ఆర్గనైజేషన్స్ను ఒకే వేదిక కిందకు తీసుకురావడమే లక్ష్యంగా NBDF ముందుకెళుతుందని ఫెడరేషన్ ప్రకటించింది. BARCపై ఆరోపణలపై NBF నిజానిజాలను నిగ్గు తేల్చుతుందని.. తద్వారా BARC జవాబుదారీతనం, ఇండిపెండెంట్ రేటింగ్స్పై ప్రేక్షకుల్లో విశ్వాసం పెంచడమే లక్ష్యంగా ముందుకెళతామని నేషనల్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ సభ్యులు ప్రకటించారు.
