ఎన్సీపీని మళ్లా నిర్మిస్తా.. కార్యకర్తల్లో ధైర్యం నింపుతం: శరద్ పవార్

ఎన్సీపీని మళ్లా నిర్మిస్తా.. కార్యకర్తల్లో ధైర్యం నింపుతం: శరద్ పవార్

సతారా (మహారాష్ట్ర) : 

దేశంలో బీజేపీ అపోజిషన్ పార్టీల్లేకుండా చేయాలని చూస్తున్నదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. అయినా, పార్టీని పునర్ నిర్మిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా సతారా జిల్లా కరాద్​లో తన రాజకీయ గురువు, మహారాష్ట్ర తొలి సీఎం యశ్వంత్ రావ్ చౌహాన్ స్మారక స్థూపం వద్ద శరద్ పవార్ నివాళులర్పించారు. అజిత్ పవార్ పార్టీ ఫిరాయింపుపై తొలిసారి స్పందించారు. కార్యకర్తలనుద్దేశించి భావోద్వేగంతో మాట్లాడారు. “మతం, కులం ప్రాతిపదికన మహారాష్ట్రతో పాటు దేశాన్ని విడగొట్టాలని చూస్తున్న వారిపై పోరాడాల్సిన అవసరం ఉంది. ఎన్సీపీని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్న వారికి వారి స్థానం ఏంటో చూపిస్తాం. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై నా పోరాటం ఈరోజు నుంచే స్టార్ట్ అవుతుంది. సమాజంలో బీజేపీ భయాన్ని సృష్టించాలనుకుంటున్నది”అని విమర్శించారు. ఎన్సీపీని బలోపేతం చేయడానికి, కార్యకర్తల్లో విశ్వాసం పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని ప్రకటించారు. 

ఫిరాయింపుల సూత్రధారి మోదీ

ఫిరాయింపుల వెనుక ప్రధాని మోదీ ఉన్నారని, బెదిరించి తమవాళ్లను తనవైపు తిప్పుకున్నారని శరద్ పవార్ విమర్శించారు. ‘‘పార్టీ మారిన వాళ్లంతా అవినీతిపరులే. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. వారిపై కేసులు ఉన్నాయి. వాటిని మాఫీ చేసుకునేందుకే ఇదంతా చేశారు. అధికారం కోసం చాలా పెద్ద తప్పు చేశారు. నాతో ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు. పార్టీనే ప్రధానం. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని బీజేపీ విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నది. మతతత్వ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే బీజేపీ లక్ష్యం. దురదృష్టవశాత్తు మా వాళ్లలో కొందరు బీజేపీ వ్యూహాలకు బలైపోయారు”అని శరద్ పవార్ అన్నారు. సోమవారం ఉదయం పుణె నుంచి కరాద్​కు బయల్దేరిన శరద్ పవార్.. దారివెంట కార్యకర్తలను పలకరిస్తూ వెళ్లారు. రోడ్డు వెంట భారీ సంఖ్యలో కార్యకర్తలు నిలబడి పవార్​కు మద్దతు ప్రకటించారు. వేలాది మందితో లోకల్ ఎమ్మెల్యే బాలాసాహెబ్ పాటిల్ శరద్​ పవార్​కు ఘన స్వాగతం పలికారు.

ప్రఫుల్, సునీల్ తట్కరేపై శరద్ పవార్ వేటు

ఎన్సీపీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్ ప్రఫుల్‌‌ పటేల్‌‌, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ తట్కరేను శరద్ పవార్ పార్టీ నుంచి తొలగించారు. కుమార్తె, వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే లేఖపై స్పందించిన శరద్ పవార్‌‌ ఈమేరకు చర్యలు చేపట్టారు. వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ లోక్‌‌సభ స్పీకర్‌‌కు కూడా ఎన్సీపీ లేఖ రాసింది.

ఫ్యామిలీలో విభేదాల్లేవ్

తమ కుటుంబంలో ఎలాంటి విభేదాల్లేవని శరద్ పవార్ స్పష్టం చేశారు. ‘‘ఫ్యామిలీ మొత్తం కలుసుకున్నప్పుడు  రాజకీయాల గురించి చర్చించం. ప్రతి ఒక్కరూ సొంత నిర్ణయం తీసుకుంటారు. అది వాళ్లకున్న హక్కు. ఆదివారం నుంచి నేను ఎవరితోనూ మాట్లాడలేదు. నన్ను కూడా ఎవరూ సంప్రదించలేదు. పార్టీని బలోపే తం చేయడమే నా ముందున్న లక్ష్యం”అని శరద్ పవార్ అన్నారు. పార్టీ ఫిరాయింపు లపై న్యాయ పోరాటానికి సంబంధించిన సమాచారమంతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ జయంత్ పాటిల్ చూసుకుంటారన్నారు. బుధవారం పార్టీ లీడర్లతో భేటీ కానున్నట్లు వివరించారు. తన ఆశీస్సులతోనే అజిత్ పవార్ బీజేపీలో చేరినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. 

మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్​కు ఎక్కువ స్థానాలున్నా యని, ప్రతిపక్ష నేత పదవి కోసం కాంగ్రెస్ వాదన సమర్థించదగినదని శరద్ పవార్ అన్నారు. పార్టీ ఫిరాయించిన అజిత్ పవార్​తో పాటు 8 మంది మంత్రులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్​కు ఎన్సీపీ లేఖ పంపింది. 1999లో ఎన్సీపీ స్థాపించిన శరద్ పవారే పార్టీ చీఫ్​గా ఉంటారని  ఎలక్షన్ కమిషన్​కు పార్టీ నాయకత్వం లెటర్ రాసింది.