ఎన్సీపీ ఎమ్మెల్యే మేనల్లుడు రాంగ్​రూట్​

ఎన్సీపీ ఎమ్మెల్యే మేనల్లుడు రాంగ్​రూట్​

ఫుణె: నేషనల్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు ఓ మోటార్ బైక్ ను ఢీ కొట్టడంతో 19 ఏండ్ల యువకుడు మృతి చెందాడు.  ఖేడ్ ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్ మోహితే పాటిల్ మేనల్లుడు మయూర్ మోహితే ఈ కారును నడిపాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం అంబేగావ్ తాలుకాలోని ఫుణె–-నాసిక్ హైవేపై మౌజే ఎక్లహరే గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిందితుడైన మయూర్ మోహితే ఫార్చ్యూనర్ కారును నేషనల్ హైవేపై వేగంగా నడిపాడు. అతడు మంచర్ గ్రామానికి వెళ్తుండగా రాంగ్ సైడ్ లో కారును నడిపి ఎదురుగా వస్తున్న మోటార్ బైక్ ను ఢీ కొట్టాడు.

ఈ ప్రమాదంలో ఓం భలేరావు అనే యువకుడు మరణించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి మయూర్​ను అరెస్టు చేశారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు నిందితుడు మద్యం మత్తులో లేడని ప్రాథమిక విచారణలో తేలింది. అయినప్పటికీ, అతడి బ్లడ్ శాంపిల్స్​ను కలెక్ట్ చేసి ల్యాబ్​కు పంపించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే దిలీప్ మోహితే స్పందించారు. ‘‘ఈ ఘటన దురదృష్టకరం. నేను ఏ తప్పును సమర్థించను. కానీ, నా మేనల్లుడు అల్కహాల్ తాగడు” అని చెప్పారు.