శరద్ పవార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.. ఎన్సీపీ కార్యకర్తలు డిమాండ్

 శరద్ పవార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి..  ఎన్సీపీ కార్యకర్తలు డిమాండ్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)  అధినేత శరద్ పవార్ అధ్యక్ష్య  పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఎన్సీపీ కార్యకర్తలు నిరసనలు  మొదలుపెట్టారు. ఆయన తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా కార్యకర్తలు ఏకీభవించడం లేదని. ఆయన మనసు మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  

ముంబైలోని వైబీ చవాన్ సెంటర్‌లో రోడ్లపై బైఠాయించి ఎన్సీపీ కార్యకర్తలు  నిరసన చేపట్టారు.  శరద్ పవార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని ఎన్సీపీ నేత అనిల్ భాయిదాస్ పాటిల్ తెలిపారు.   

చివరి శ్వాస వరకు ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా శరద్ పవార్ కొనసాగాలన్నది తమ నిర్ణయమని ఆయన వెల్లడించారు.  శరద్ పవార్ తన నిర్ణయాన్ని పునరాలోచించాలని ఛగన్ భుజ్‌బల్, జితేంద్ర అవద్ ,  దిలీప్ వాల్సే పాటిల్‌లతో సహా ఎన్‌సిపి నాయకులు కూడా అభ్యర్థిస్తున్నారు. ఈ విషయంపై శరద్ పవార్‌తో సుప్రియా సూలే మాట్లాడాలని ఎన్సీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. 

అయితే శరద్ పవార్ తాను తీసుకున్న నిర్ణయం పట్ల వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.  మనమంతా కలిసి పని చేద్దామని, తన  రాజీనామాను ఆమోదించండి అంటూ తన రాజీనామాను వ్యతిరేకిస్తున్న పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.