న్యూఢిల్లీ, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన కర్ల రాజేశ్ లాకప్ డెత్ ఘటనలో డెడ్‌బాడీకి బీబీనగర్ ఎయిమ్స్‌లో రీపోస్టుమార్టం చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసినట్లు జాతీయ ఎస్సీ కమిషన్ (ఎన్‌సీఎస్సీ) మెంబర్ వడ్డేపల్లి రామచందర్ తెలిపారు. అలాగే, ఘటనకు సంబంధించి ఎస్‌ఐని పది రోజుల్లో సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు.
ఈ మేరకు డీజీపీ, సూర్యాపేట కలెక్టర్, ఎస్పీకి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో రామచందర్ మీడియాతో మాట్లాడారు. పోలీసుల టార్చర్ తట్టుకోలేక రాజేశ్ ప్రాణాలు విడిచారని.. బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు కమిషన్ కేసును సుమోటోగా స్వీకరించిందని వివరించారు.
ఈ ఘటనపై ఎస్సీ కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజల నుంచి సమాచారం తెలుసుకుందన్నారు. కస్టడీలో ఉన్న రాజేశ్‌పై పోలీసులు చిత్రహింసలకు పాల్పడ్డారని ఆరోపించారు. పెయిన్ కిల్లర్స్ ఇచ్చి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. రిమాండ్‌కు ఇచ్చిన 5 రోజులకు రాజేశ్ మృతిచెందడం బాధ కలిగించదన్నారు. తాము ఈ కేసును సుమోటోగా స్వీకరించిన తర్వాత అక్కడి పోలీసులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి, సీఐను సస్పెండ్ చేశారని గుర్తుచేశారు.
