హిమాన్షీ​పై ట్రోలింగ్ వద్దు .. నేవీ ఆఫీసర్ భార్యపై విమర్శలను ఖండించిన ఎన్‌‌‌‌సీడబ్ల్యూ

హిమాన్షీ​పై ట్రోలింగ్ వద్దు .. నేవీ ఆఫీసర్ భార్యపై విమర్శలను ఖండించిన ఎన్‌‌‌‌సీడబ్ల్యూ

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షీ న‌‌‌‌ర్వాల్​ను సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తుండటంపై జాతీయ మహిళా కమిషన్(ఎన్‌‌‌‌సీడబ్ల్యూ) సీరియస్ అయింది. హిమాన్షీ అప్పీల్​ను తప్పుపడుతూ ట్రోల్ చేయడం సరికాదంటూ  ట్రోలింగ్​ను ఖండించింది. గురువారం హిమాన్షి ప్రజలకు ఒక ఎమోషనల్ అప్పీల్ చేశారు. "నా భర్త వినయ్ ఎక్కడున్నా..ఆత్మ శాంతితో ఉండాలని దేశం మొత్తం ప్రార్థించాలని కోరుకుంటున్నాను.

 నేను కోరుకునేది ఇంకొకటి ఉంది. పహల్గాం ఉగ్రదాడి ఘటనలో ప్రజలు ముస్లింలు లేదా కాశ్మీరీలపై ద్వేషంతో ఉండటం చూస్తున్నాను. మాకు ఇది వద్దు. మాకు శాంతి కావాలి, శాంతి మాత్రమే కావాలి. ఒక వర్గం వారిని టార్గెట్ చేసేలా వ్యాఖ్యలు చేయొద్దు" అని భావోద్వేగంతో విజ్ఞప్తి చేశారు. హిమాన్షీ న‌‌‌‌ర్వాల్ చేసిన కామెంట్లు నచ్చని కొందరు నెటిజన్లు ఆమెను విమర్శిస్తూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. హిమాన్షి నర్వాల్ అభిప్రాయంపై విమర్శలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది.