రిటైర్డ్ ఆర్టీసీ బస్ డ్రైవర్ ఇంట్లో 29 కోట్ల డబ్బు, 15 కిలోల బంగారం దొరకడం ఏంటయ్యా !

రిటైర్డ్ ఆర్టీసీ బస్ డ్రైవర్ ఇంట్లో 29 కోట్ల డబ్బు, 15 కిలోల బంగారం దొరకడం ఏంటయ్యా !

బీర్భూమ్: పశ్చిమ బెంగాల్లో పోలీసుల సోదాల్లో షాకింగ్ పరిణామం వెలుగుచూసింది. బీర్భూమ్ జిల్లాలో గతంలో ఆర్టీసీ బస్సు నడిపిన మాజీ బస్సు డ్రైవర్ ఇంట్లో జరిపిన సోదాల్లో 28 కోట్ల రూపాయలకు పైగా డబ్బు, 15 కిలోల బంగారం లభ్యం కావడంతో పోలీసులు కంగుతిన్నారు.

డబ్బును, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బీర్భూమ్ జిల్లాలో మంగళవారం అర్ధ రాత్రి మొదలైన ఈ పోలీసు సోదాలు, బుధవారం సాయంత్రం వరకూ కొనసాగాయి. 18 గంటలకు పైగా పట్టుబడిన డబ్బును లెక్కించారు. బీర్భూమ్‌లోని మహమ్మద్ బజార్, దేవుచాలో ఉన్న ఈ మాజీ బస్సు డ్రైవర్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు.

ప్రభుత్వ బస్సు డ్రైవర్గా పనిచేసి రిటైర్ అయిన మినార్ మండల్‌ ఇళ్లలో ఈ సొత్తు దొరికింది. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ డబ్బు, బంగారం తనవి కావని మోండల్ చెప్పినట్లు దర్యాప్తు చేసిన పోలీసుల్లో ఒకరు చెప్పారు. తన బావ అయిన తులు మోండల్ అలియాస్ మహ్మద్ నజీబుద్దీన్ ఆ డబ్బు, బంగారాన్ని తన ఇంట్లో దాచిపెట్టాడని దర్యాప్తు అధికారులకు ఈ మాజీ బస్సు డ్రైవర్ చెప్పినట్లు సమాచారం.

తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాటు వర్గంలో చేరిన సీనియర్ పొలిటీషియన్ అనుబ్రత మండల్‌కు తులు మండల్ సన్నిహితుడని తెలిసింది. మాజీ బస్సు డ్రైవర్ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం దొరకడం పశ్చిమ బెంగాల్లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

ఈ రికవరీ పరిణామం పశ్చిమ బెంగాల్లో రాజకీయ ప్రకంపనలు రేపింది. TMC అవినీతిపరుల సొమ్ము ఇలా బినామీల దగ్గర ఉందని అధికారంలో ఉన్న బీజేపీ విరుచుకుపడింది. అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో రికవరీ చేయడంపై పోలీసులను సీఎం సువేందు అధికారి అభినందించారు.