- మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి నీలం మధు
పటాన్చెరు, వెలుగు: పేదల సంక్షేమం కోసం పరితపించిన పోరాట యోధుడు కేవల్ కిషన్ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి నీలం మధు అన్నారు. శుక్రవారం ఆయన వర్ధంతి సందర్భంగా చిట్కుల్ ఎన్ఎంఆర్ ఆఫీసులో కిషన్ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ..నిరంతరం ప్రజల హక్కుల కోసం పోరాటం చేసి ప్రజల కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు కేవల్ కిషన్ అన్నారు.
అలాంటి మహనీయున్ని ప్రజలు స్మరించుకుంటూ ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి చుట్టూ ఎడ్లబండ్లను తిప్పుతూ జాతరను చేయడం హర్షణీయమన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువతరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచులు మణిదీప్, దానంపల్లి సుజాతసత్యం, గీత నరేందర్, కృష్ణ, నాయకులు శ్రీనివాస్, మహేశ్, గణేశ్, ప్రవీణ్, రంజిత్, తదితరులు పాల్గొన్నారు.
కేవల్ కిషన్ ఆశయ సాధనకు కృషి: ఎమ్మెల్సీ ప్రకాశ్
మెదక్ (చేగుంట): కేవల్ కిషన్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఎమ్మెల్సీ, రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బండ ప్రకాశ్ పిలుపునిచ్చారు. కిషన్ వర్ధంతి సందర్భంగా చేగుంట మండలం పొలంపల్లి శివారులో ఉన్న ఆయన సమాధి వద్ద జాతర నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రకాశ్ మాట్లాడుతూ పేదల భూ సమస్యల పరిష్కారానికి కేవల్ కిషన్ తన జీవితాన్ని ధారపోశారని గుర్తు చేశారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు.
ముదిరాజ్ ల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి, జిల్లా మత్స్యశాఖ అధ్యక్షుడు, జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు రామ కిష్టయ్య, కేవల్ కిషన్ కూతురు, రిటైర్డ్ హెల్త్ కమిషనర్ డాక్టర్ వీణ, పొలంపల్లి సర్పంచ్ రాజ్యలక్ష్మి స్వామి, రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షుడు సత్తయ్య, బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, రాష్ట్ర ముదిరాజ్ యువత అధ్యక్షుడు బాలు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనకయ్య, గ్రేటర్ హైదరాబాద్ కో ఆర్డినేటర్ సతీశ్ పాల్గొన్నారు.
