
- పరీక్ష రాయనున్న 72 వేల మంది అభ్యర్థులు
- మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్
- మధ్యాహ్నం 1.30 గంటలు దాటితే సెంటర్లలోకి నో ఎంట్రీ
హైదరాబాద్, వెలుగు: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ఆదివారం జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 190 సెంటర్లలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో మొత్తం 72,507 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరుకానున్నారు. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా 62 కేంద్రాల్లో 26 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా బయోమెట్రిక్ అటెండెన్స్ ద్వారా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు.
మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులను మూడు గంటల ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్నాహ్నం 1.30 గంటలకు రిపోర్టింగ్ సమయంగా నిర్ణయించారు. 1.30 గంటలోపు వచ్చిన విద్యార్థులనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, సిటీలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా సమయానికి సెంటర్లకు చేరుకోవాలని సూచించారు.
అభ్యర్థులు స్మార్ట్ వాచ్, సెల్ ఫోన్లు, హ్యాండ్ బ్యాగులు ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకురాకూడదన్నారు. స్లిప్పర్స్, ఓపెన్ గా ఉండే చెప్పులనే అనుమతిస్తామ.. షూస్, హై హీల్స్ కు అనుమతి లేదని వెల్లడించారు. పురుషులు ప్లెయిన్ షర్ట్స్, ప్యాంట్లు, మహిళలు సల్వార్లు, ట్రౌజర్లు ధరించాలని, జీన్స్, జిప్స్ ఎక్కువగా ఉన్న డ్రెస్సులు, కుర్తా పైజామాలు, ట్రాక్ ప్యాంట్లు, కార్గో ప్యాంట్లకు అనుమతి లేదన్నారు.
సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు
నీట్ పరీక్షను ప్రశాంత వాతవరణంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీఎస్ రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెంటర్ల వద్ద మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక సీనియర్ అధికారిని నోడల్ ఆఫీసర్గా, భద్రత కోసం ఒక పోలీస్ అధికారిని నియమించారు.