‘నీట్’ స్థానికత అంశంపై సుప్రీం తీర్పు రిజర్వ్

‘నీట్’ స్థానికత అంశంపై సుప్రీం తీర్పు రిజర్వ్
  • వాదనలు ముగించిన సీజేఐ బెంచ్

న్యూఢిల్లీ, వెలుగు: మెడికల్ సీట్ల వ్యవహారంలో స్థానికత అంశానికి సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు వాదనలు ముగించింది. సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు సీజేఐ ధర్మాసనం వెల్లడించింది. 

మెడికల్ కోర్సు అడ్మిషన్ల స్థానికతకు సంబంధించి నీట్​కు ముందు నాలుగేండ్లు స్థానికంగా చదవాలని నిబంధనలు చేర్చుతూ.. తెలంగాణ ప్రభుత్వం జీవో 33ని తీసుకొచ్చింది. ఈ జీవోలోని నిబంధన 3 (ఏ)లో ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొంది. ఈ జీవోను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ కు చెందిన కల్లూరి అభిరామ్ తో పాటు మరో 160 మంది రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.

 దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం.. ‘ఒక విద్యార్థి తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వ గైడ్ లైన్స్ లేవు. మొదట గైడ్ లైన్స్, రూల్స్ రూపొందించాలి’అని ప్రభుత్వానికి సూచిస్తూ విద్యార్థులకు ఫేవర్ గా గతేడాది సెప్టెంబర్ 5న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సెప్టెంబర్ 11న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.

 ఈ ఎస్ఎల్పీని మంగళవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని జస్టిస్ కె వినోద్ చంద్రన్  తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారరించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ, కాళోజీ వర్సిటీ తరఫున సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర్ నారాయణన్ వాదనలు వినిపించారు. 

సీజేఐ కోర్టు జాబితాలో మొదటి అంశంగా ప్రారంభమైన ఈ కేసు విచారణ దాదాపు రెండున్నర గంటల పాటు సాగింది. అన్ని వైపులా సుదీర్ఘ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని వాది, ప్రతివాదులకు సూచిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది.