దేశవ్యాప్తంగా ‘నీట్’ మంటలు... బిహార్‌‌‌‌లో గాల్లోకి కాల్పులు, లాఠీచార్జ్.. మహారాష్ట్ర బంద్

దేశవ్యాప్తంగా ‘నీట్’ మంటలు... బిహార్‌‌‌‌లో గాల్లోకి కాల్పులు, లాఠీచార్జ్.. మహారాష్ట్ర బంద్

ముంబై/పాట్నా: నీట్ పేపర్ లీకేజీలు, ఢిల్లీ విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా గురువారం దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. బిహార్‌‌‌‌ తీవ్ర హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోగా, మహారాష్ట్రలో 'వీబీఏ' చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. బిహార్ వ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జహానాబాద్, దర్భంగా, కటిహార్ జిల్లాల్లో విద్యార్థులు రోడ్డెక్కి రైల్వే, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. 

జహానాబాద్ జిల్లా కలెక్టర్ నివాసంపై రాళ్లదాడి జరగడంతో పోలీసులు 20 నుంచి 30 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. దర్భంగాలో ఆందోళనకారులు జరిపిన రాళ్లదాడిలో సిటీ ఎస్పీ సహా 14 మంది పోలీసులు గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా దళాలు విపరీతంగా లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించి పలువురిని అరెస్టు చేశాయి.

మహారాష్ట్రలో బంద్.. 

ప్రకాశ్ అంబేద్కర్ నాయకత్వంలోని వంచిత్ బహుజన్ ఆఘాడీ (వీబీఏ) పిలుపునిచ్చిన బంద్‌‌‌‌కు మహారాష్ట్రలో భారీ స్పందన లభించింది. ముంబై, నాగపూర్, పూణే, ఛత్రపతి శంభాజీనగర్‌‌‌‌లలో వీబీఏ కార్యకర్తలు పన్వేల్-సియాన్ ప్రధాన రహదారిని దిగ్బంధించారు. బంద్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 3,500 మంది తమ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారని ప్రకాశ్ అంబేద్కర్ మండిపడ్డారు. 

పోలీస్ వ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడ్డుకున్న మోడల్ రియా అహిర్

ముంబైలోని శివాజీ పార్క్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యాన్​లో తరలిస్తుండగా 27 ఏళ్ల మోడల్ రియా అహిర్ ధైర్యంగా అడ్డుకుంది. పోలీసులను " అరెస్ట్ మెమో ఉందా?" అని నిలదీసింది. వారి వద్ద సమాధానం లేకపోవడంతో వ్యాన్ ముందుకు వెళ్లి బోనెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చెయ్యేసి అడ్డంగా నిలబడింది. ఆమెకు తోడుగా స్థానికులు రావడంతో పోలీసులు విద్యార్థులను వదిలేశారు. 

కేరళ, మేఘాలయల్లోనూ నిరసనలు..

ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండిస్తూ కేరళ వ్యాప్తంగా ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఐ ఆధ్వర్యంలో పోస్టాఫీసుల ముట్టడి జరిగింది. పోలీసుల వాటర్ క్యానన్, టియర్ గ్యాస్ ప్రయోగంతో కొచ్చిలో కొందరు విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. మరోవైపు మేఘాలయలోని విపక్ష వీపీపీ, ఎన్​ఈహెచ్​యూఎస్​యూ విద్యార్థి సంఘాలు షిల్లాంగ్‌‌‌‌లో ప్రదర్శన చేపట్టారు. తమిళనాడు, జార్ఖండ్​, మిజోరాం, రాజస్తాన్, హర్యానా, అస్సాం రాష్ట్రాల్లో సైతం విద్యార్థులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మరికొన్ని చోట్ల బంద్ పాటించారు.