- కేంద్ర మంత్రి రాజీనామాకు డిమాండ్
సిటీ నెట్వర్క్, వెలుగు: నీట్- పరీక్షా పత్రం లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎన్టీఏ డీజీ అభిషేక్ సింగ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు భారీ ఆందోళనలు చేపట్టాయి. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు నిరసన తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మూడుసార్లు పేపర్ లీక్ అవ్వడం వల్ల 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిందన్నారు. ఎన్టీఏను రద్దు చేయాల్సిందేన్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు.
ఎస్ఎఫ్ఐ నేతలు ఉరివేసుకున్నట్లుగా ప్రదర్శన చేస్తూ.. పరీక్షా వ్యవస్థను మోదీ ప్రభుత్వం కోచింగ్ మాఫియాకు, కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టిందని విమర్శించారు. చిక్కడపల్లి సిటీ లైబ్రరీ వద్ద విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇకనైనా పరీక్షల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలని డిమాండ్ చేశారు. సోమాజిగూడలోని లోక్ భవన్ వద్ద బీఆర్ఎస్వీ చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో విద్యార్థులు లోక్ భవన్ ముట్టడికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పంజాగుట్ట ఏసీపీ మురళీకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి.
