గత లీకేజీల నుంచి పాఠాలు నేర్చుకోరా ? ఎన్‌‌‌‌టీఏపై సుప్రీంకోర్టు ఆగ్రహం

గత లీకేజీల నుంచి పాఠాలు నేర్చుకోరా ? ఎన్‌‌‌‌టీఏపై సుప్రీంకోర్టు ఆగ్రహం
  • కేంద్ర ప్రభుత్వం, ఎన్‌‌‌‌టీఏ, సీబీఐకి నోటీసులు జారీ
  • మూడు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆర్డర్

న్యూఢిల్లీ: జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో గత తప్పిదాల నుంచి ఎన్​టీఏ పాఠం నేర్చుకోకపోవడం అత్యంత విచారకరమని దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. గతంలో లీకేజీ ఘటనలకు కారణమైన పొరపాట్లను గుర్తించి, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ అంశంపై సోమవారం చేపట్టిన విచారణలో భాగంగా సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

‘‘గతంలో జరిగిన తప్పుల నుంచి గుణపాఠం నేర్వకపోవడం ఆందోళనకరం. పేపర్​ లీకేజీల అంశం ఇంతకు ముందే కోర్టు విచారణకు వచ్చింది.  దానిపై నియమించిన ఒక పర్యవేక్షణ కమిటీ పలు సూచనలు చేసింది, ఎన్‌‌‌‌టీఏ వాటిని అంగీకరించింది. అయితే, వాటిని అమలు చేశారా లేదా అని మేం ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాం’’ అని పేర్కొంది.

నీట్ పేపర్​ లీక్, పరీక్ష రద్దుపై ఫేడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) దాఖలు చేసిన పిటిషన్​ను జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని, పిటిషన్ కాపీలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు అందజేయాలని కోర్టు ఆదేశించింది.

దేశంలో 22.7 లక్షల మంది అభ్యర్థుల హక్కులపై ఇది నేరుగా దాడి చేసినట్టేనని (ఫైమా) అడ్వకేట్ తన్వీ దూబె పేర్కొన్నారు. ఎన్‌‌‌‌టీఏను రద్దుచేసి, కోర్టు పర్యవేక్షణలో పనిచేసే ‘‘నేషనల్ ఎగ్జామినేషన్ ఇంటెగ్రిటీ కమిషన్’’ను ఏర్పాటు చేయాలని, పేపర్ పరీక్షను ఆపేవేసి కంప్యూటర్ పరీక్షకు (సీబీటీ) మారాలని తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు ఇస్రో మాజీ చీఫ్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ చేసిన సూచనలను అమలు చేయడంలో ఏం చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లోగా అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని ఎన్‌‌‌‌టీఏను ఆదేశించింది.

పుణెకు చెందిన ఫిజిక్స్ లెక్చరర్ మనీషా హవల్దార్ ఎన్‌‌‌‌టీఏ తరఫున ట్రాన్స్​లేటర్​గా పనిచేస్తూ ఫిజిక్స్ ప్రశ్నలు లీక్ చేసినట్టు సీబీఐ ఆరోపించింది. అధికారులు ఆమెను మే 22న అరెస్ట్ చేశారు. సోమవారం ఢిల్లీ కోర్టు ఆమెను ఆరు రోజుల సీబీఐ కస్టడీకి ఇచ్చింది.

గతంలో జరిగిన తప్పుల నుంచి గుణపాఠం నేర్వకపోవడం ఆందోళనకరం. పేపర్​ లీకేజీల అంశం ఇంతకు ముందే కోర్టు విచారణకు వచ్చింది. దానిపై నియమించిన ఒక పర్యవేక్షణ కమిటీ పలు సూచనలు చేసింది, ఎన్‌‌‌‌టీఏ వాటిని అంగీకరించింది. అయితే, వాటిని అమలు చేశారా? లేదా? అని మేం ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాం.

సుప్రీంకోర్టు