నిర్లక్ష్యం కంపుకొడుతోంది .. దుర్గం చెరువులో చేపల మృత్యువ్యాత

నిర్లక్ష్యం కంపుకొడుతోంది .. దుర్గం చెరువులో చేపల మృత్యువ్యాత

ఐటీ కారిడార్​లోని ఐకానిక్ ​దుర్గం చెరువు కంపుకొడుతోంది. వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడుతున్నా ఇరిగేషన్​అధికారులు పట్టించుకోవడం లేదు. చెరువును మెయింటైన్​ చేస్తున్న ఐటీ కంపెనీ సైతం అటువైపు కన్నెత్తి చూడడం లేదు.

మాదాపూర్, వెలుగు: మాదాపూర్​ దుర్గం చెరువు నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చుట్టు పక్కల కాలనీల నుంచి మురుగునీరు, పలు హాస్పిటల్స్​నుంచి మెడికల్ వేస్ట్, ఇతర వ్యర్థాలు వచ్చి చేరుతుండడంతో చెరువు నుంచి భరించలేని దుర్వాసన వెదజల్లుతోంది. ఫలితంగా నీరు కలుషితంగా మారి ఆక్సిజన్​ లెవల్స్​తగ్గిపోవడంతో చేపలు చనిపోతున్నాయి. వేల సంఖ్యలో చనిపోయిన చేపలు ఒడ్డుకు వచ్చి చేరుతున్నాయి. చనిపోయిన వాటిని కనీసం తొలగించకపోవడంతో ఆ ప్రాంతమంతా అందవిహీనంగా మారింది.

ఈ చెరువుపైనే ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి ఉండడంతో పర్యాటకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. చుట్టూ పక్కల నివాసం ఉండే వాకర్లు చెరువు ట్రాక్ ​మీదకు వాకింగ్​ చేస్తుంటారు. అయితే, ఇందుకు తగ్గట్టుగా ఇక్కడ మౌలిక వసతులు లేవు. పైగా చెరువులో చేపలు చనిపోతున్నాయని అధికారులకు, అక్కడే విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తెలియజేస్తున్నా పట్టించుకోవడం లేదని సందర్శకులు, వాకర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. బోటింగ్ సమయంలో నీటి దుర్వాసన భరించలేకపోతున్నామని వాపోతున్నారు. 

 భరించలేకపోయాం

కేబుల్ ​బ్రిడ్జి చూసి చెరువులో బోటింగ్ చేసేందుకు పిల్లలతో కలిసి హిమాయత్​నగర్​నుంచి వచ్చాం. కానీ ఇక్కడ సరైన వసతులు లేవు. బోటింగ్​ చేస్తుంటే నీటిపై మొత్తం చనిపోయిన చేపలు కనిపిస్తున్నాయి.  దుర్వాసన భరించలేకపోయాం. హంగు ఆర్భాటానికే దుర్గం చెరువు ఉందే తప్ప, మెయింటైన్​ చేయడం లేదు. మరోసారి రావొద్దనిపించింది.

పావని, హిమాయత్​నగర్​