మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన క్రికెటర్.. జైలు శిక్ష!

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన క్రికెటర్.. జైలు శిక్ష!

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపాల్‌ మాజీ కెప్టెన్‌ సందీప్‌ లామిచానేని ఖాట్మండ్ జిల్లా కోర్టు దోషిగా తేల్చింది. అతడు అత్యాచారానికి పాల్పడ్డాడని నిర్ధారించింది. అయితే, అత్యాచారం జరిగిన సమయంలో సదరు బాలిక మైనర్ కాదని న్యాయస్థానం తెలిపింది. శిశిర్ రాజ్ ధాకల్‌తో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ తీర్పిచ్చింది.

ఏంటి ఈ కేసు..?

2022 ఆగస్టు 21న ఖాట్మండులోని ఓ హోటల్‌లో లామిచానే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని 17 ఏళ్ల బాధితురాలు గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేసింది. లమిచానే తనను మభ్యపెట్టి ఈ విధంగా చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదచేసిన పోలీసులు అతన్ని విచారణకు హాజరవ్వాలని సూచించారు. అయితే, అతడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న లామిచానే అక్కడే ఉండిపోయాడు. దీంతో నేపాల్ పోలీసులు ఇంటర్ పోల్‌ను ఆశ్రయించడంతో వారు అతన్ని అదుపులోకి తీసుకొని.. వారికి అప్పగించారు. అనంతరం అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు. 

అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో లామిచానేకు జైలు శిక్ష పడనుంది. జనవరి 10, 2024న కోర్టు అతనికి శిక్షను ఖరారు చేయనుంది. 23 ఏళ్ల లెగ్ స్పిన్నర్ ఐపీఎల్‌లో ఆడిన తొలి నేపాల్ క్రికెటర్‌ కావడం గమనార్హం. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున లామిచానే ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు.