ఇండియా నుంచి మామిడి పండ్ల దిగుమతి నిషేధంపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది నేపాల్ దేశం. భారతదేశంలో పండే మ్యాంగోలపై నిషేధం విధించలేదని.. దిగుమతులను తగ్గించినట్లు వెల్లడించింది నేపాల్ అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ. నిబంధనల ప్రకారం మాత్రమే దిగుమతి చేసుకుంటున్నామని.. దిగుమతికి సంబంధించిన విధివిధానాలు పరిశీలించిన తర్వాతనే నేపాల్ దేశంలోకి భారతీయ మామిడి పండ్లు వస్తున్నట్లు వెల్లడించింది ఆ శాఖ. నేపాల్ దేశంలో మామిడి పండ్ల నిల్వలకు సంబంధించి గోదాములు ఖాళీగా లేవని.. అన్నీ ఫుల్ గా ఉన్నాయని.. అందుకే పరిమితంగానే దిగుమతి చేసుకుంటున్నామని.. నిషేధం ఏమీ లేదని వెల్లడించింది నేపాల్ అటవీ శాఖ.
ఎం జరిగిందంటే:
నేపాల్‌లోని మధేష్ ప్రావిన్స్ సరిహద్దులో ఉన్న భిట్టమోడ్ చెక్ పోస్ట్ దగ్గర తెగుళ్లు ఉన్నాయనే అనుమానంతో భారత మామిడి పండ్ల లోడ్‌ను అధికారులు నిలిపివేశారు. దీంతో భారత మామిడి పండ్లపై నేపాల్ నిషేధం విధించిందంటూ సోషల్ మీడియాలో, వార్తల్లో ప్రచారం జరిగింది. అయితే భారత అధికారులు అవసరమైన మొక్కల ఆరోగ్య ధృవీకరణ పేపర్స్ చూపించడంతో, నేపాల్ అధికారులు ఆ లోడ్‌ను అనుమతించారు. పేపర్స్ అన్ని సరిగ్గా ఉన్నాకే అనుమతి ఇచ్చామని నేపాల్ వ్యవసాయ శాఖ అధికారి స్పష్టం చేశారు.
►ALSO READ | మమతా బెనర్జీని మోసం చేయలేను : పార్టీలోనే ఉంటానన్న శతృఘ్న సిన్హా
భారత్ నుండి వచ్చే మామిడి పండ్లను పూర్తిగా నిలిపివేస్తే నేపాల్ మార్కెట్లో పెద్ద కొరత ఏర్పడుతుందని పండ్ల వ్యాపారులు హెచ్చరించారు. నేపాల్‌లో మామిడి పండ్లను తినే సీజన్‌లో అక్కడి స్థానిక ఉత్పత్తి ప్రజల డిమాండ్‌కు సరిపోదు. కేవలం జనక్‌పుర్‌ధామ్ అనే ప్రాంతానికే భారత్ సరిహద్దు జిల్లాల నుండి రోజుకు 50 టన్నులకు పైగా మామిడి పండ్లు వస్తాయి. ఇక్కడి నుంచే కాఠ్మండు, ఇతర నగరాలకు మామిడి పండ్లను సరఫరా చేస్తారు. అందుకే దిగుమతులను ఆపడం కంటే, సరిహద్దుల్లో చెకింగ్ మరింత పటిష్టం చేయాలని వ్యాపార సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
నేపాల్ పెట్టిన నిబంధనలు
తెగుళ్లు, పురుగులు ఉన్న పండ్లు దేశంలోకి రాకుండా చూడటానికి నేపాల్ అధికారులు కొన్ని క్వారంటైన్ నియమాలను అమలు చేస్తున్నారు. ప్రస్తుత నియమాల ప్రకారం, భారత్ నుండి వచ్చే మామిడి పండ్లను ఒక గంట పాటు 48°C వేడినీటిలో శుద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.... నాణ్యత, తనిఖీల విషయంలో చిన్నచిన్న సమస్యలు వస్తున్నప్పటికీ నేపాల్ ఇప్పటికీ భారతీయ మామిడి పండ్లపైనే ఎక్కువగా ఆధారపడుతోంది.
