నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌లో సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు.ముప్కాల్ లక్ష్మీ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఈ ఘటన జరిగింది. బాధితులు నిజామాబాద్ ఆటోనగర్‌కు చెందిన వాళ్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ గాలింపు చర్యల్లో ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా, మరొకరి కోసం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ప్రాణాలు కోల్పోయిన యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటనతో ఆటోనగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
