నెదర్లాండ్స్‌ కమాల్‌

నెదర్లాండ్స్‌ కమాల్‌

అల్ రయాన్‌‌‌‌: ఫిఫా వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో సూపర్ పెర్ఫామెన్స్ చేస్తున్న నెదర్లాండ్స్ క్వార్టర్‌‌‌‌ ఫైనల్‌‌‌‌కు దూసుకెళ్లగా, అమెరికా కథ మరోసారి ప్రిక్వార్టర్స్‌‌‌‌లోనే ముగిసింది. శనివారం జరిగిన తొలి ప్రిక్వార్టర్‌‌‌‌ ఫైనల్లో ఫస్టాఫ్‌‌‌‌లోనే రెండు గోల్స్ తో పంజా విసిరిన నెదర్లాండ్స్ 3–1తో యూఎస్‌‌‌‌ఏను చిత్తు చేసింది. మెంఫిస్‌‌‌‌ డెపే (10వ నిమిషంలో), డలే బ్లైండ్‌‌‌‌ (45+ 1వ ని.), డంఫ్రైస్‌‌‌‌ (81) తలో గోల్‌‌‌‌తో డచ్‌‌‌‌ టీమ్‌‌‌‌ను గెలిపించారు. యూఎస్ తరఫున సబ్‌‌‌‌స్టిట్యూట్ ప్లేయర్‌‌‌‌ హజి రైట్(67వ ని.) ఏకైక గోల్ అందించాడు. మూడుసార్లు రన్నరప్ (1974, 1978, 2010) అయిన డచ్ జట్టు వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో వరుసగా 11 మ్యాచ్‌‌‌‌ల్లో ఓటమి లేకుండా దూసుకెళ్తుండటం విశేషం. మెగా టోర్నీలో ఆడిన చివరి ఆరు ప్రిక్వార్టర్స్ లో ఆ జట్టుకు ఇది ఐదో విజయం.  మరోవైపు సరికొత్త జట్టుతో టోర్నీకి వచ్చిన యూఎస్‌‌‌‌ఏ 2002 తర్వాత తొలిసారి క్వార్టర్స్ చేరాలన్న ప్రయత్నం ఫలించలేదు.

డచ్ ధమాకా

డచ్ టీమ్ తో పోలిస్తే బాల్ కంట్రోల్‌‌‌‌లో పైచేయి చూపెట్టిన అమెరికా టార్గెట్‌‌‌‌పై ఎనిమిది సహా 17 షాట్లు కొట్టింది. కానీ, పెద్దగా ఫలితం రాబట్టలేకపోయింది. టార్గెట్‌‌‌‌పై 6 సహా ఓవరాల్‌‌‌‌గా 11 షాట్లు కొట్టినప్పటికీ నెదర్లాండ్స్ పర్‌‌‌‌ఫెక్ట్ ఆటతో గోల్స్‌‌‌‌ రాబట్టింది. ఇరాన్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌లో అయిన గాయం నుంచి కోలుకొని తిరిగొచ్చిన అమెరికా ప్లేయర్‌‌‌‌ పులిసిచ్‌‌‌‌ మూడో నిమిషంలోనే జట్టుకు గోల్‌‌‌‌ అందించినంత పని చేశాడు. అయితే, డచ్‌‌‌‌ కీపర్‌‌‌‌ నొపేర్ట్‌‌‌‌.. అతని షాట్‌‌‌‌ను బ్లాక్ చేశాడు. మరోవైపు స్టార్టింగ్‌‌‌‌లోనే యూఎస్‌‌‌‌ఏ డిఫెన్స్‌‌‌‌ను బ్రేక్‌‌‌‌ చేసిన డచ్ టీమ్‌‌‌‌కు పదో నిమిషంలోనే గోల్ దక్కింది. పెనాల్టీ ఏరియాలో డంఫ్రైస్‌‌‌‌ నుంచి పాస్ అందుకున్న డెపే బాటమ్‌‌‌‌ లెఫ్ట్‌‌‌‌ కార్నర్‌‌‌‌ నుంచి గోల్ చేశాడు. స్కోరు సమం చేసేందుకు అమెరికా చాలా ప్రయత్నాలు చేసినా డచ్​ డిఫెండర్లు నిలువరించారు. ముఖ్యంగా కీపర్‌‌‌‌ నొపెర్ట్‌‌‌‌ అద్భుత సేవ్స్‌‌‌‌తో ఆకట్టుకున్నాడు. 42వ నిమిషంలో టిమ్ వియా 25 గజాల నుంచి కొట్టిన షాట్‌‌‌‌ను డైవ్‌‌‌‌ చేస్తూ అడ్డుకున్నాడు. ఫస్టాఫ్ చివరి నిమిషాల్లో త్రోయిన్ తో వచ్చిన బాల్​ను డంఫ్రైస్ నుంచి అందుకున్న డలే గోల్ చేయడంతో నెదర్లాండ్స్​ ఆధిక్యం డబులైంది. సెకండాఫ్‌‌‌‌లో హజి రైట్ అందించిన గోల్‌‌‌‌తో అమెరికా 1–2తో రేసులోకి వచ్చే ప్రయత్నం చేసింది. కానీ, తొలి రెండు గోల్స్‌‌‌‌కు సహకారం అందించిన డంఫ్రైస్‌‌‌‌ బాక్స్ దగ్గర తెలివిగా చేసిన గోల్‌‌‌‌తో యూఎస్‌‌‌‌ఏ ఆశలు ఆవిరయ్యాయి.