పార్లమెంట్‎లోకి దూసుకెళ్లిన గాడిద.. ఎంపీలను ఢీకొట్టి సభలో హల్ చల్

పార్లమెంట్‎లోకి దూసుకెళ్లిన గాడిద.. ఎంపీలను ఢీకొట్టి సభలో హల్ చల్

ఇస్లామాబాద్: పాకిస్తాన్ పార్లమెంట్‎లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా ఓ గాడిద ఒక్కసారిగా సభలోకి ప్రవేశించింది. దీంతో ఎంపీలు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గాడిదను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ గాడిద సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టింది. సభలో అటు ఇటు ఇష్టమొచ్చినట్లుగా పరుగులు పెడుతూ పలువురు ఎంపీలను ఢీకొట్టింది. చివరకు సిబ్బంది గాడిదను పట్టుకుని బయటకు తీసుకెళ్లడంతో ఎంపీలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తం సీసీ కెమెరాలో రికార్డయింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ వీడియో క్షణాల్లో వైరల్‎గా మారింది. టైట్ సెక్యూరిటీ ఉండే పార్లమెంట్‎లోకి గాడిద ప్రవేశించడంపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. గాడిద తన సొంత కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‎ను కలిసి వారికి ఏదో చెప్పడానికి వెళ్లిందని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. కుటుంబ సభ్యులను బాగా మిస్ అయిన గాడిద చివరికి తన ఇంటికి వెళ్లిందని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. తన సీటులో వేరే ఎవరో కూర్చున్నారని.. అందుకే గాడిద అంత కోపంగా ఉందని మరో యూజర్ చమత్కరించాడు. 

ఈ ఘటనపై సెనేట్ చైర్మన్ యూసఫ్ రజా గిలానీ ఫన్నీగా మాట్లాడారు. జంతువులు కూడా మన చట్టాలలో తమ పాత్రను కోరుకుంటున్నాయని చమత్కరించారు. చైర్మన్ జోక్‎తో సభలో చప్పట్లు మోగాయి. మరోవైపు ఈ భద్రతా వైఫల్యంపై అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. సభలోకి గాడిద ఎలా ప్రవేశించిందని ఆరా తీశారు. సర్వీస్ కారిడార్ నుంచి గాడిద దారి తప్పి లోపలికి వచ్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సభ కార్యకలాపాలు జరుగుతోన్న సమయంలో ఏకంగా గాడిద సభలో ప్రవేశించడంతో పార్లమెంట్ భద్రతా చర్యలపై ఆందోళనలు తలెత్తుతున్నాయి.