చట్ట సవరణలతో స్మోకింగ్‌ అలవాటు మరింత పెరుగుతుంది

చట్ట సవరణలతో స్మోకింగ్‌ అలవాటు మరింత పెరుగుతుంది
  • పొగాకు వినిమయం తగ్గించడం కాదు.. మరింత పెంచేలా ప్రతిపాదనలున్నాయి
  • పొగాకు అక్రమ వ్యాపారం పెరుగుతుంది.. నాణ్యతలేని పొగాకు సైతం చెలామణిలోకి వస్తుంది
  • నూతన కోట్పా సవరణ బిల్లు 2020పై కన్జూమర్ ఆన్ లైన్ ఫౌండేషన్‌ ఆందోళన
  • సర్వేచేసిన అధ్యయన వివరాలను విడుదల చేసిన సీఎఫ్ఓ

న్యూఢిల్లీ: చట్ట సవరణలతో దేశంలో పొగతాగే (స్మోకింగ్‌) అలవాటు మరింత పెరుగుతుందని, కోట్పా చట్ట సవరణ-2020 బిల్లులోని ప్రతిపాదనలు పొగాకు వినిమయం తగ్గించడం కాదు.. మరింత పెంచేలా ఉన్నాయని కన్జూమర్ ఆన్ లైన్ ఫౌండేషన్‌ (సీఎఫ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. చట్ట సవరణ వల్ల దేశంలో పొగాకు అక్రమ వ్యాపారం పెరుగుతుందని, అంతే కాదు నాణ్యతలేని పొగాకు సైతం చెలామణిలోకి వస్తుందని పేర్కొంది. నూతన కోట్పా సవరణ బిల్లు 2020పై కన్జూమర్ ఆన్ లైన్ ఫౌండేషన్‌ దేశ వ్యాప్తంగా సర్వేచేసి, అధ్యయనం చేసిన వివరాలను సోమవారం విడుదల చేసింది. లాభాపేక్ష లేకుండా వినియోగదారుల హక్కుల కోసం పోరాడుతున్న సేవా సంస్థ సీఎఫ్ఓ కొత్త చట్ట సవరణలపై కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని సూచించింది. 
నూతన కోట్పా సవరణ బిల్లు-2020..  అమలులో ఎదురయ్యే సవాళ్లపై దేశ వ్యప్తంగా నిపుణులతో మాట్లాడి అధ్యయనం చేసింది. ఈ  సమగ్ర అధ్యయన వివరాలను సోమవారం ఢిల్లీలో విడుదల చేసింది. పొగాకు నియంత్రణ నిబంధనలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం లో క్షేత్ర స్థాయిలో భారతదేశ వ్యాప్తంగా 5116 మంది అభిప్రాయాలను సేకరించారు. పొగాకు నియంత్రణ పరంగా   ప్రజల అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉన్నాయని వినియోగదారుల సంక్షేమ ఉద్యమకర్త, సీఎఫ్ఓ ఫౌండర్ ట్రస్టీ ప్రొఫెసర్‌ బెజోన్‌ మిశ్రా మాట్లాడుతూ ‘‘కోట్పా చట్ట సవరణల గురించి ప్రజలు, నిపుణుల అభిప్రాయాలను తీసుకుని.. వాటిని విశ్లేషిస్తూ.. విధాన నిర్ణేతలు పరిగణలోకి తీసుకునే విధానంలో సమర్పించామన్నారు. 
కొత్త చట్ట సవరణల వల్ల దేశంలో అక్రమ పొగాకు వాణిజ్యం పెరుగుతుంది
కొత్త చట్ట సవరణల వల్ల అక్రమ పొగాకు వాణిజ్యం దేశంలో పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని, అంతేకాదు పొగాకు వాడకం తగ్గడానికి బదులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగంలో పొగాకు వాణిజ్యం నియంత్రించాల్సిన అవసరం ఉందని సీఎఫ్ఓ ఫౌండర్ ట్రస్టీ ప్రొఫెసర్‌ బెజోన్‌ మిశ్రా పేర్కొన్నారు.  
సమానమైన పన్నులు విధానం ఉండాలి
అక్రమ వ్యాపారం, నాణ్యతలేని, కల్తీ పొగాకు వాడకాన్ని కంట్రోల్ చేయడానికి సమానమైన పన్నుల విధానం ఉండాలని సీఎఫ్ఓ ఫౌండర్ ట్రస్టీ ప్రొఫెసర్‌ బెజోన్‌ మిశ్రా సూచించారు. భారతీయ వినియోగదారులను నాణ్యత లేని  పొగాకు ఉత్పత్తుల బారి నుంచి కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మార్కెట్‌ వాటా పరంగా అతి తక్కువగా ఉన్నప్పటికీ సిగరెట్ల మీదనే అధికంగా బిల్లులో దృష్టి కేంద్రీకరించారని ఆయన వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం భారతదేశంలో అధిక శాతం మంది పొగ రహిత పొగాకు అంటే ఖైనీ, పొగాకుతో బీటెల్‌ క్విడ్‌ , జర్దా వంటివి వినియోగిస్తున్నారని ఆయన తెలిపారు. 
18ఏళ్లకే సిగరెట్ లేదా జర్దా, ఖైనీ వాడకం మొదలుపెట్టారు
సీఎఫ్ఓ అధ్యయనంలో దేశ వ్యాప్తంగా పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 20 శాతం మంది మాత్రమే సిగరెట్లు కాల్చడానికి ఇష్టపడుతుంటే.. 75 శాతం మందికిపైగా పొగాకు నమలడాన్ని ఇష్టపడుతున్నామని చెప్పారని సీఎఫ్ ఓ సీఎఫ్ఓ ఫౌండర్ ట్రస్టీ ప్రొఫెసర్‌ బెజోన్‌ మిశ్రా తెలిపారు. ఇదే అంశాన్ని తమ అధ్యయనంలో కూడా నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిస్తున్నామన్నారు. అంతేకాదు దాదాపు 57శాతం మంది కేవలం 18సంవత్సరాల వయసులోనే పొగాకు వాడకం..(స్మోకింగ్ లేదా.. జర్దా, ఖైనీ, పొగాకు ఉత్పత్తులు) ఆరంభించినట్లు గుర్తించామని వెల్లడించారు. చట్ట సవరణలు అమల్లోకి వస్తే 77.50శాతం మంది అక్రమ రవాణా చేసిన, పన్నులు లేని, తక్కువ నాణ్యత కలిగిన పొగాకుకు ప్రాధాన్యతనిస్తామంటున్నారని ఆయన తెలిపారు. 93శాతం మంది లూజ్‌ పొగాకు అమ్మకాల విక్రయాలపై నిషేధం కారణంగా స్మోకింగ్‌ అలవాటు మరింత పెరుగుతుందని స్పష్టం చేశారని వివరించారు. మరో 81.9శాతమ ది పొగాకు వాడేటప్పుడు  బ్రాండ్‌ సమాచారానికి ప్రభావితం అవుతున్నట్లు తెలిపారని, 63శాతం మంది చట్టబద్ధమైన సంస్థల చేతిలో బాధితులుగా మారే అవకాశాలున్నాయని వెల్లడించారు.  89శాతం మందికి పైగా స్పందనదారులు నిర్దేశిత స్మోకింగ్‌ ప్రాంగణాలను మూసివేయాలనే ప్రతిపాదనకు మద్దతునందించమని తేల్చి చెప్పారని ఆయన వివరించారు.