పద్మారావునగర్, వెలుగు : న్యూబోయిగూడ ప్రాంతంలో అర్ధరాత్రి మెట్రో రైళ్ల ట్రయల్స్వల్ల వస్తున్న సౌండ్‌తో నిద్రపోలేకపోతున్నామని స్థానికులు డీజీపీకి లెటర్ రాశారు. మెట్రో ధ్వని కాలుష్యంతో కొంతకాలంగా అక్కడి స్థానికులు, పిల్లలు, వృద్ధులు, పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మెట్రో, ఎల్అండ్టీ , పీసీబీ, కలెక్టర్‌కు సైతం ఫిర్యాదులు చేశారు.
2026 మార్చి 6న మెట్రో రైల్ బృందం న్యూబోయిగూడలోని మెట్రో పిల్లర్ నంబర్ బి--1006 పరిసర ప్రాంతాల్లో సర్వే చేసింది. ఇందులో అర్ధరాత్రి మెట్రో ట్రయల్స్వల్ల ధ్వని కాలుష్యం 80 డెసిబెల్స్ గా నమోదైంది. జీఓ 72 ప్రకారం రాత్రి టైంలో నివాస ప్రాంతాల్లో ధ్వని స్థాయి 45 డెసిబెల్స్ కు మించకూడదు. అయినా ఇప్పటివరకు ఏ యాక్షన్తీసుకోలేదు. దీంతో అక్కడ ప్రధానంగా ఇబ్బందులు పడుతున్న ఎంఎన్‌కే విట్టల్ సెంట్రల్ కోర్ట్ అపార్ట్ మెంట్ వాసుల తరఫున ప్రెసిడెంట్ డాక్టర్ జి. హనుమాన్లు పీసీబీకి ఫిర్యాదు చేయగా, గత సంవత్సరం జూన్ 13న సర్వే చేశారు.
ఇందులో ఏకంగా అర్ధరాత్రి మెట్రో రైళ్ల వల్ల వెలువడుతున్న ధ్వని స్థాయి 97 డెసిబెల్స్ గా నమోదైంది. చర్యలు తీసుకోవాలని వారు మెట్రో రైల్, ఎల్ అండ్ టీ, పోలీస్ శాఖకు లెటర్లు రాశారు. అయినా చేసిందేమీ లేదు. దీంతో మరో మార్గం లేక డీజీపీకి లెటర్‌రాశారు. స్పందించిన డీజీపీ, లెటర్‌ను పిటిషన్‌గా నమోదు చేసి సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని హనుమాన్లు తెలిపారు.
