హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్పిటల్స్, క్లినిక్‌లు, డయగ్నొస్టిక్ సెంటర్ల నియంత్రణ కోసం ప్రభుత్వం కొత్తగా ‘‘స్టేట్ కౌన్సిల్ ఫర్ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్’’ను ఏర్పాటు చేసింది. గత కౌన్సిల్ పదవీకాలం ఈ ఏడాది జూన్ లో ముగియడంతో... క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్స్ యాక్ట్- 2010 ప్రకారం ఈ కమిటీని పునర్ వ్యవస్థీకరిస్తూ వైద్య ఆరోగ్య శాఖ జీవో నంబర్ 173 జారీ చేసింది. ఈ కౌన్సిల్ సభ్యులు మూడేండ్ల పాటు పదవిలో కొనసాగుతారు.
కౌన్సిల్ కు హెల్త్ సెక్రటరీ ఎక్స్- అఫీషియో చైర్ పర్సన్‌గా వ్యవహరించనుండగా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) మెంబర్ సెక్రటరీలుగా ఉంటారు. వైస్ చైర్మన్‌గా డాక్టర్ జి.శ్రీనివాస్ ను నియమించారు. సభ్యులుగా నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్, స్టేట్ మెడికల్, డెంటల్, నర్సింగ్, ఫార్మసీ కౌన్సిళ్ల ప్రతినిధులు, ఐఎంఏ (ఐఎంఏ) ప్రతినిధి డాక్టర్ దయాళ్ సింగ్, అడ్వకేట్ కె.గౌరీశంకర్ రావు, హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ కు చెందిన ముజ్తబా హసన్ అస్కారీ సహా పలువురికి చోటు కల్పించారు. రాష్ట్రంలోని క్లినికల్ సంస్థల రిజిస్ట్రేషన్, వాటి పనితీరును మానిటరింగ్ చేయడం, నిబంధనలు సరిగ్గా అమలయ్యేలా చూడటం వంటి బాధ్యతలను ఈ కౌన్సిల్ నిర్వర్తిస్తుంది.
