
- ఫ్యాకల్టీ లేదు, ల్యాబుల్లేవు, కొత్త కోర్సులు పెట్టలేం
- బీటెక్ బయోటెక్నాలజీ, బీఏ ఆన్సైర్స్ కోర్సులకు ఓయూ నో
- మాపై హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఒత్తిడేంది?
- టీజీసీహెచ్ఈకి ఉస్మానియా యూనివర్సిటీ వివాదాస్పద లేఖ
హైదరాబాద్, వెలుగు: హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, ఉస్మానియా యూనివర్సిటీ మధ్య కొత్త కోర్సుల పంచాయితీ మొదలైంది. మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టుగా కొత్త కోర్సులు ప్రవేశ పెట్టాలని కౌన్సిల్ అధికారులు సూచించగా.. ‘ఫ్యాకల్టీ లేదు.. ల్యాబుల్లేవు.. కొత్త కోర్సులు పెట్టలేం’ అంటూ ఓయూ స్పష్టం చేసింది. 108 ఏండ్ల చరిత్ర ఉన్న ఓయూ అటానమీని దెబ్బతీసేలా వ్యవహరించొద్దని కౌన్సిల్ అధికారులకు స్పష్టంచేసింది. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్ నరేశ్ రెడ్డి.. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ కు లేఖ రాశారు.
యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ బయోటెక్నాలజీ కోర్సు పెట్టాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఈ నెల1న ఓయూకు లేఖ రాసింది. కానీ, కోర్సులు పెట్టేందుకు క్లాసు రూములు, హాస్టల్ సౌకర్యాలు, కొత్త ల్యాబులు తప్పనిసరి. అయితే, టెక్నాలజీ కాలేజీలో అవసరమైన రెగ్యులర్ ఫ్యాకల్టీ, క్లాసులు, హాస్టల్ వంటివి లేవని ఓయూ అధికారులు తిరిగి హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కు లేఖ రాశారు. కాలేజీలో కేవలం నాలుగు యూజీ, 12 పీజీ కోర్సులున్నాయని.. కానీ, కేవలం ఐదుగురు మాత్రమే ఫ్యాకల్టీ ఉందని చెప్పారు.
ఇప్పటికే వారిపై అదనపు భారం పడుతోందన్నారు. దీంతో 2025– 26 నుంచి కొత్త కోర్సును ప్రారంభించలేమని స్పష్టం చేశారు. మరో పక్క ఆర్ట్స్ కాలేజీలో బీఏ తెలుగు ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు మీడియాకు చెప్పారని ఓయూ అధికారులు లేఖలో పేర్కొన్నారు. కానీ, ఆ కాలేజీలో పీజీ, పీహెచ్డీ ప్రోగ్రాములు మాత్రమే ఉన్నాయని తెలిపారు. యూనివర్సిటీ అనుమతి లేకుండా కౌన్సిల్ అధికారులు ప్రకటనలు చేయడంతో విద్యార్థులు, అడ్మినిస్ట్రేషన్ లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కోర్సును ఇప్పటికే తిరస్కరించినట్టు గుర్తుచేశారు. అయితే, కామన్ అకడమిక్ క్యాలెండర్, కామన్ సిలబస్ పై 2017లోనే గవర్నర్ ఆదేశాలివ్వడం గమనార్హం.
కోర్సులు, సిలబస్ ను ఓయూ నిర్ణయిస్తుంది
ఓయూకు 108 ఏండ్ల చరిత్ర ఉందని, వర్సిటీకి స్టాట్యూట్స్, ఆర్డినెన్సెస్, బోర్డ్ ఆఫ్ స్టడీస్, అకడమిక్ సెనేట్ తదితర రెగ్యులేటరీ బాడీలు ఉన్నాయని లేఖలో ఓయూ అధికారులు పేర్కొన్నారు. పీజీ కోర్సుల ప్రవేశాలు, సిలబస్ సవరణలను ఓయూ నిర్ణయిస్తుందని గుర్తుచేశారు. గతేడాది దాకా యూజీ అల్మానాక్ లు వర్సిటీ స్థాయిలోనే నిర్ణయించగా, ఈ ఏడాది నుంచే కౌన్సిల్ తమ చేతుల్లోకి తీసుకున్నదని
ఆరోపించారు. వర్సిటీ అధికారులను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం అటానమీకి హాని కలిగిస్తోందన్నారు. అయితే, లేఖను కాలేజీ విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, విద్యాశాఖ సెక్రటరీ
యోగితా రాణాతో పాటు ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డికి పంపించడం గమనార్హం. దీంతో సర్కారు లోపాలను ఎత్తిచూపించినట్టు స్పష్టమవుతోంది.
విజ్ఞప్తులతోనే వర్సిటీలకు సూచన..
రాష్ట్రంలోని సర్కారు, యూనివర్సిటీ కాలేజీల్లో బీటెక్ బయోటెక్నాలజీ కోర్సు పెట్టాలనే డిమాండ్ కొంతకాలంగా వస్తోంది. ఈ క్రమంలోనే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి.. టీజీసీహెచ్ఈకి లేఖ రాయగా, మంత్రి శ్రీధర్ బాబు కూడా సూచన చేశారు. మరోపక్క పలు విద్యార్థి సంఘాలు,పేర్సెంట్స్ వినతిపత్రాలు సమర్పించారు. ఈ క్రమంలోనే కౌన్సిల్ వైస్ చైర్మర్ మహమూద్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ఈ కమిటీ అన్ని వర్సిటీ కాలేజీల్లో బీటెక్ బయోటెక్నాలజీ కోర్సు పెట్టాలని సిఫారసు చేసింది. దీంతోనే ఓయూలో కొత్త కోర్సు పెట్టాలని సూచన చేసినట్టు కౌన్సిల్ అధికారులు చెప్తున్నారు. దీనిపై ఓయూ అధికారులు రాద్దాంతం చేయడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.