వరంగల్​లో సైక్లింగ్ లేన్ ​వెలవెల 

వరంగల్​లో సైక్లింగ్ లేన్ ​వెలవెల 

‘గ్రేటర్​ వరంగల్ ​కార్పొరేషన్ అధికారులు అందమైన సైక్లింగ్​ లేన్స్​ డెవలప్ ​చేశారు. వారికి నా అభినందనలు’ అంటూ కొంతకాలం కింద మంత్రి కేటీఆర్​ ట్విటర్​లో జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లను అభినందిస్తూ ఓ పోస్ట్​ పెట్టారు. దీనికి స్పందించిన స్థానిక అధికారులు కూడా ‘మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు సార్’ అని పొంగిపోయి రిప్లై ఇచ్చారు. కానీ ఇప్పుడీ స్లైక్లింగ్ ​ట్రాక్​ పనికిరాకుండా పోయింది. సుమారు 4 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన ఈ ట్రాక్ ​మధ్యలో పలు షాప్స్​యజమానులు దిమ్మెలు కట్టారు. చాలామంది టూ వీలర్ల పార్కింగ్​ కోసం వాడుతున్నారు. మరోవైపు స్మార్ట్​సిటీలో భాగంగా నగరంలో నిర్మించిన ఫుట్​పాత్​ల పరిస్థితీ ఇలాగే ఉంది. ఇవి స్థానిక వ్యాపారులు బిజినెస్​ చేసుకునే అడ్డాలుగా మారిపోయాయి.  

వరంగల్​, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ లో రూ.కోట్లతో ఏర్పాటు చేసిన సైక్లింగ్​ ట్రాక్‍, ఫుట్‍ పాత్‍ లు జనాలకు ఉపయోగపడడం లేదు. ట్రై సిటీలో కొంత విశాలంగా ఉండే ఎన్ఐటీ ప్రాంతంలోని మెయిన్‍ రోడ్లను తవ్వి అధికారులు సైకిల్‍ ట్రాక్ ఏర్పాటు చేశారు. 'సైకిల్ ఫర్‍ చేంజ్' పేరుతో రూ.2 కోట్లు ఖర్చు చేశారు.మొదటి దశలో ఫాతిమా జంక్షన్‍ నుంచి ఎన్‍ఐటీ మీదుగా ఫారెస్ట్​ ఆఫీస్‍ జంక్షన్‍ వరకు రెండువైపులా 4 కిలోమీటర్ల ట్రాక్​ నిర్మించారు. ఎమ్మెల్యేలు, లీడర్లు ఇక్కడ సైకిల్‍ తొక్కుతూ ఫొటోలు దిగి సోషల్‍ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. మున్సిపల్‍ శాఖ మంత్రి కేటీఆర్‍ కూడా ట్విటర్​లో ట్రాక్​ పనులు చేయించిన ఆఫీసర్లను మెచ్చుకున్నారు. దీని తరహాలోనే ఇతర జిల్లాల్లో కూడా ట్రాక్స్​ఏర్పాటు చేయాలని ఆఫీసర్లకు సూచించారు. 

అడ్డంగా దిమ్మెలు..బండ్ల పార్కింగ్​
రూ. కోట్లతో కట్టిన సైక్లింగ్ ​ట్రాక్​ ఒక్కో చోట ఒక్కో సైజులో కనిపిస్తోంది. ఓ ప్రాంతంలో15 అడుగుల స్థలం ఉంటే..మరికొన్ని ప్రాంతాల్లో కనీసం రెండు అడుగులు కూడా లేదు. ప్రతి రెండు అడుగులకో షాపింగ్‍ కాంప్లెక్స్ ఉండడంతో కొంతమంది ట్రాక్​పై అడ్డంగా దిమ్మెలు కట్టుకున్నారు. ఇంకొన్ని చోట్ల కరెంట్‍ పోల్స్ అడ్డం వచ్చాయి. ట్రాక్‍ పనులు సరిగ్గా జరగట్లేదని ‘వెలుగు’లో అప్పట్లో కథనం  కూడా ప్రచురితమైంది. అయినా మంత్రి కేటీఆర్​'బ్యూటిఫుల్‍ అండ్‍ బెస్ట్ ​సైక్లింగ్ ​ట్రాక్‍’ అంటూ ట్వీట్ ​పెట్టారు.  కానీ, అలా ఏమీ లేదని చాలామంది నగరవాసులు కేటీఆర్​ ట్వీట్​కు రిప్లై ఇచ్చారు. ట్రాక్‍ నిర్మాణం సరిగా లేదని, కోట్లాది రూపాయల జనం సొమ్ము వృథా చేయడమేంటని ప్రశ్నించారు. స్పందించిన అధికారులు ఇబ్బందులను అధిగమించి ట్రాక్‍ పర్​ఫెక్ట్​గా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. బెంగళూర్, ముంబై తరహాలో బెస్ట్ ​ట్రాక్ అని పేరు వచ్చేలా తీర్చిదిద్దుతామని మాటిచ్చారు. ట్రాక్‍పై పార్కింగ్‍ చేస్తే పెనాల్టీ వేస్తామన్నారు. కానీ ఇవన్నీ మాటలుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు ట్రాక్​పై సైకిల్​ తొక్కేవాళ్లెవరూ కనిపించడం లేదు.   

ఫుట్‍పాత్‍లపై హోటళ్లు, బిర్యాని సెంటర్లు 
వరంగల్‍, హన్మకొండ, కాజీపేటల్లో పబ్లిక్​ రోడ్ల పక్కన ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిచేందుకు స్మార్ట్​సిటీలో భాగంగా 50 నుంచి 60 కిలోమీటర్ల మేర ఫుట్‍పాత్‍లు నిర్మించారు. గ్రిప్‍ కోసం రంగురంగుల టైల్స్​ వేశారు. జిగేల్‍మనేలా అడుగుకో లైట్లు పెట్టారు. వరద నీరు పోవడానికి పైపులైన్స్, కేబుల్స్ ​కోసం డ్రైన్‍ నిర్మించారు. దీనికోసం రూ.వందల కోట్లు ఖర్చు చేశారు. కానీ ఇప్పుడు ఈ ఫుట్​పాత్​లన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. వందలాది షాపింగ్‍ మాల్స్​, బైక్ షోరూంలు, హోటళ్లు, బిర్యానీ సెంటర్లు ఫుట్‍పాత్‍లను ఆక్రమించుకుని బిజినెస్​సెంటర్లుగా మార్చుకున్నాయి. దీంతో ఈ ఫుట్​పాత్​లపై జనం అడుగు పెట్టడమే గగనమైపోయింది. మళ్లీ రోడ్లపైనే నడుస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు మాత్రం ఎప్పటిలాగే మామూళ్లు తీసుకుంటూ సైలెన్స్​ అయిపోయారు. 

ట్రాక్‍ పార్కింగ్‍ స్లాట్‍ మారింది
సిటీలో సైక్లింగ్​ ట్రాక్‍ నిర్మించారనగానే హ్యాపీగా ఫీలయ్యాం. కానీ అందరూ దీనిని మిస్‍యూజ్‍ చేస్తున్నారు. ట్రాక్‍ మొత్తం పార్కింగ్‍ స్లాట్‍ లెక్క మారింది. అడుగడుగునా బైకులు, ఇతర వాహనాలు పార్క్​ చేస్తున్నారు.కొన్నిచోట్ల ట్రాక్‍ దాటి రోడ్డు మీదకు రావాల్సి వస్తోంది. అక్కడ వాహనాలు సైక్లిస్టులను ఢీకొడుతున్నాయి. కాళ్లు, చేతులు విరగ్గొట్టుకుని హాస్పిటల్స్​ లో అడ్మిట్​ అయ్యే పరిస్థితులున్నాయి.  
– స్రవంతి రెడ్డి, సైక్లిస్ట్, హన్మకొండ

ఫుట్‍పాత్‍ల మీద నడిచెటోళ్లేరి 
సిటీ అంతటా ఫుట్‍పాత్‍లు ఉన్నాయనే పేరు తప్పించి ప్రయోజనం లేకుండా పోయింది. వాటిపైనే పండ్ల దుకాణాలు, బిర్యానీ సెంటర్లు, హోటళ్లు ఏర్పాటు చేశారు. ఎక్కడా వంద మీటర్లు నడిచే పరిస్థితి లేదు.రోడ్లపైనే నడుస్తుండడంతో ఏ వాహనం ఢీకొడుతుందోనని భయడాల్సి వస్తోంది. కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ఫుట్‍పాత్‍లు జనాలకు అందుబాటులో లేకుంటే ఏం లాభం? ఈ విషయం గురించి మంత్రి, అధికారులు, ఆలోచించాలి.  
- కట్ట రవి, గోపాల్‍పూర్‍