- తాజా ఐపీఎస్‌ల బదిలీల్లో ఆనంద్ స్థానంలో ..
- హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శిఖా గోయల్ నియామకం
- ఈ నెల 30తో ముగియనున్న డీజీపీ శివధర్ రెడ్డి పదవీకాలం
- యూపీఎస్సీ ఫైనల్ లిస్టులో సీనియర్ ఐపీఎస్‌గా సీవీ ఆనంద్
- మే మొదటి వారంలో డీజీపీగా బాధ్యతలు చేపట్టే అవకాశం
- ఫ్యూచర్ సిటీ కొత్త సీపీగా తరుణ్‌జోషి, మల్కాజిగిరి సీపీగా సుమతి బదిలీ
- ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర డీజీపీగా సీవీ ఆనంద్(1991 బ్యాచ్) నియామకానికి లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సీవీ ఆనంద్ పోస్టులో ప్రిన్సిపల్ సెక్రటరీగా డీజీ శిఖాగోయల్(1994 బ్యాచ్)ను ప్రభుత్వం నియమించడం ఇందుకు ఊతమిస్తోంది.
ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవీకాలం ఈ నెల 30తో ముగియనుండగా.. ఆయన స్థానంలో సీవీ ఆనంద్‌కు బాధ్యతలు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే కీలక స్థానాల్లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సీనియర్ ఐపీఎస్‌గా సీవీ ఆనంద్
పూర్తిస్థాయి డీజీపీ నియామకానికి సంబంధించి ఇప్పటికే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనల్ లిస్ట్ చేరిన సంగతి తెలిసిందే. యూపీఎస్సీ ప్యానెల్ లిస్టులో1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్,1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా పేర్లు ఉన్నాయి. వీరిలో సీవీ ఆనంద్ సీనియర్ కావడంతో పాటు పూర్తిస్థాయి డీజీపీగా అన్ని అర్హతలు కలిగి ఉన్నారు.
యూపీఎస్సీ నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి డీజీపీగా సీవీ ఆనంద్ నియామకం ఇక లాంఛనప్రాయమే. దీంతో ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవి విరమణ తర్వాత మే మొదటి వారంలోనే సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిసింది.
ఫ్యూచర్ సిటీకి కొత్త పోలీస్ బాస్
ఫ్యూచర్ సిటీ కమిషన్ సుధీర్‌బాబు పదవీకాలం ఈ నెలాఖరున ముగియనుండడంతో ఆయన స్థానంలో తరుణ్ జోషి(2004 బ్యాచ్)ని ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలోనే విజిలెన్స్ డీజీగా డీఎస్ చౌహాన్(1997), మల్టీ జోన్-2 ఐజీగా షానవాజ్ ఖాసీం(2003)ను బదిలీ చేసింది. షానవాజ్ ఖాసీంకు పోలీసు పర్సనల్ ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
మల్కాజ్గిరి కమిషనర్‌గా ఉన్న అవినాశ్ మహంతి(2004)ని డ్రగ్స్ కంట్రోల్ డీజీగా నియమించారు. తరుణ్ జోషి స్థానంలో మహంతికి ఏసీబీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మల్కాజ్గిరి సీపీగా అవినాశ్ మహంతి స్థానంలో బి సుమతి(2006)ని నియమించారు. ఇంటెలిజెన్స్ ఐజీపీ కార్తికేయ(2006)కు ఎస్ఐబీ ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

