కొత్త ఎక్సైజ్​ పాలసీ.. భూముల విలువల సవరణ.. ఇవే ఆదాయానికి మార్గాలు

కొత్త ఎక్సైజ్​ పాలసీ.. భూముల విలువల సవరణ.. ఇవే ఆదాయానికి మార్గాలు
  •  ఇవే ఆదాయానికి మార్గాలు
  • ఎక్సైజ్​ ఆదాయం రూ.27,623 కోట్లుగా అంచనా
  • స్టాంప్స్ అండ్​ రిజిస్ట్రేషన్స్​తో రూ.19,103 కోట్లు  
  • భూముల అమ్మకాలపైనే నాన్​ ట్యాక్స్​ రెవెన్యూ 

హైదరాబాద్, వెలుగు: కొత్త ఎక్సైజ్​ పాలసీ, భూముల విలువల సవరణపై రాష్ట్ర సర్కారు ఆశలు పెట్టుకున్నది. ఈ నేపథ్యంలోనే బడ్జెట్​లో ట్యాక్స్​ రెవెన్యూ పై భారీగా అంచనాలు చూపించింది. ఈ ఏడాది కొత్త ఎక్సైజ్​ పాలసీ అందుబాటులోకి రానున్నది.  వైన్స్​ షాప్​లకు అప్లికేషన్లు తీసుకోనున్నందున ఈ ఫీజులతో భారీగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు  బడ్జెట్​లో ఎక్సైజ్​ ఆదాయాన్ని గతం కంటే రూ.2 వేల కోట్లు ఎక్కువగా రూ.27,623 కోట్లు  ప్రతిపాదించింది. 

ఇది కాకుండా ఎక్సైజ్​ వ్యాట్​ రూపంలో వచ్చే మొత్తం ఇంకో రూ.20 వేల కోట్లు పైన వస్తుందని అంచనా వేసింది. వెరసి కేవలం ఎక్సైజ్​ ఆదాయమే రూ.47 వేల కోట్లు దాటనున్నది. ఇటీవల బీర్ల రేట్లు పెంచడం, కొత్త కంపెనీలకు ఆహ్వానం పలకడం వంటివి రాబడి పెరిగేందుకు కలిసి వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. 

అదే సమయంలో ఎలైట్​ బార్లు, ఎలైట్​ వైన్స్​లను పెంచే ఆలోచనలో ఉన్నది. ఇది కాకుండా స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా ఈసారి భారీగా అంచనా వేసింది. ప్రభుత్వం రీజినల్​ రింగ్​ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, పరిశ్రమల కారిడార్​, రోడ్ల నిర్మాణం వంటి వాటితో రియల్​ బూమ్​​ వస్తుందని ఆశిస్తున్నది.  భూముల విలువలనూ సవరించనున్నది. ఫలితంగా  నిరుడి కంటే రూ.5 వేల కోట్లు అదనంగా అంటే రూ.19,103 కోట్లు టార్గెట్​గా పెట్టుకున్నది.  

ఎల్ఆర్ఎస్​ ప్రక్రియ కూడా కొనసాగుతుండడంతో ఈసారి టార్గెట్​ రీచ్​ అవుతామని ప్రభుత్వం అనుకుంటున్నది. జీఎస్టీలో లీకులను ఆరికట్టడం, ఇసుక రవాణాలో అక్రమాలకు తావు లేకుండా చూడడం తోనూ ప్రభుత్వ సొంత ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నది.  2025–26 వార్షిక ​ బడ్జెట్​లో ట్యాక్స్​ ఆదాయం రూ.1.45 లక్షల కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో  లిక్కర్, స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్లు, జీఎస్టీ, ఇతర సేల్స్​ ట్యాక్స్​ వంటివి ఉన్నాయి.  

నాన్​ ట్యాక్స్​ రెవెన్యూ రూ.31,611 కోట్లు

 నాన్​ ట్యాక్స్​ రెవెన్యూను కూడా బడ్జెట్​లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మొత్తం రూ.31,611 కోట్లుగా చూపింది. అంతకు ముందు ఏడాది రూ.35 వేల కోట్లు అంచనా వేయగా.. సవరించిన అంచనాల్లో రూ.25,807 కోట్లుగా మార్చింది.  భూములను తనాఖా పెట్టడం లేదా అమ్మకాల ద్వారా రాబడి పొందాలని భావిస్తున్నది. 

కొన్నిచోట్ల ప్రభుత్వానికి అవసరం కాదు అనుకున్న ల్యాండ్స్​ను గుర్తించింది. ఇందులో టీజీఐఐసీ నుంచి రూ.20 వేల కోట్ల నుంచి రూ. 30 వేల కోట్ల విలువ చేసే , హెచ్​ఎండీఏ నుంచి మరికొన్ని భూములు అమ్మేందుకు రెడీ అవుతున్నది.  రాజీవ్​ స్వగృహ, ఓఆర్ఆర్​ చుట్టూ టౌన్​ షిప్​లు ఇతరత్రా  చేపట్టడం, అమ్మకాలు చేయడం ద్వారా సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతోపాటు జీఎస్టీతో ఆదాయం రూ.37,463  కోట్లు వస్తుందని ప్రతిపాదించింది. వాహనాలపై విధించే ట్యాక్స్​ రూ.8,535 కోట్లు వస్తుందని అంచనా వేసింది. పెట్రోల్​, డిజీల్ పై విధించే వ్యాట్​తో మరింత రాబడి రానున్నది.